వ్యయమే ప్రియమా!

19 Jul, 2019 10:51 IST|Sakshi

వర్టికల్‌ గార్డెనింగ్‌ ఏర్పాటుకు రూ.కోట్లలో వ్యయం

నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించిన హెచ్‌ఎండీఏ  

బెంగళూర్‌లో పైసా ఖర్చు లేకుండా ఏర్పాటు  

ఇక్కడా ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయం  

అధికారులు మారడంతో అటకెక్కిన ఆలోచన  

ఇష్టారాజ్యంగా అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం

సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్లకు వర్టికల్‌ గార్డెనింగ్‌ ఏర్పాటు చేయాలనే హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆలోచన బాగానే ఉన్నా... అందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. బెంగళూర్‌లోని హోసర్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ పిల్లర్లకు వర్టికల్‌ గార్డెనింగ్‌ను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద కొన్ని కంపెనీలు అందించిన సహకారంతో  ‘సే ట్రీస్‌’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయగా... అందుకు భిన్నంగా నగరంలో ఏర్పాటుకు మాత్రం హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు సంస్థ ఖజానా నుంచే ఖర్చు చేసేందుకు మొగ్గు చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే ‘సే ట్రీస్‌’ సంస్థ రెండేళ్ల క్రితం పీవీఎన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్లకు వర్టికల్‌ గార్డెనింగ్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సమయంలో అప్పటి అధికారులు ఆసక్తి చూపారు. అప్పటి కమిషనర్‌ టి.చిరంజీవులు వర్టికల్‌ గార్డెనింగ్‌ రూ.కోట్లలో వ్యయమవుతున్న నేపథ్యంలో కార్పొరేట్‌ కంపెనీలు సీఎస్‌ఆర్‌ కింద ఒక్కో పిల్లర్‌ను దత్తత తీసుకోవాలని భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు.

కొన్ని కంపెనీల నుంచి సానుకూలత వ్యక్తమైనా... ఆ తర్వాత అధికారులు మారడంతో ఎవరూ దీనిపై దృష్టిసారించలేదు. కనీసం అదే ఆలోచనను అమలు చేస్తున్నారంటే అదీ లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు కార్పొరేట్‌ కంపెనీల సహాయం తీసుకోవడం కంటే.. సంస్థ ఖజానా నుంచే ఖర్చు చేస్తే పోలా అనే ధోరణిలో మూడుసార్లు టెండర్‌ పిలిచారు. ఒకరిద్దరూ కోట్‌ చేసినా మళ్లీ పక్కన పెట్టేశారు. చివరకు ల్యాండ్‌ స్కేపింగ్‌లో మంచి అనుభవముందంటూ నగరానికి చెందిన గ్రీన్‌లైఫ్‌ ల్యాండ్‌స్కేపింగ్‌ డెవలపర్స్‌ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో వర్టికల్‌ గార్డెనింగ్‌ పనులు అప్పగించారు. దీంతో ఆ సంస్థ పీవీఎన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే 3, 5, 6, 13, 14 పిల్లర్లకు రూ.56 లక్షల వ్యయంతో పనులు చేపట్టింది. ఇక్కడ మరో విషయమేమిటంటే అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా పనులు చేయించుకోవాలంటే హెచ్‌ఎండీఏ ఎంప్యానల్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగించాల్సి ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాట్లాడేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు మాత్రం నిరాకరిస్తున్నారు. 

దుబారాపై దుమారం...
జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో పిల్లర్లకు వర్టికల్‌ గార్డెనింగ్‌ ఏర్పాటు చేస్తే బ్యూటీఫుల్‌గా కనిపిస్తుందని, ట్రాఫిక్‌లో చిక్కుకునే వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగేలా చేస్తుందని హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే వీటి ఏర్పాటుకు రూ.కోట్లలో ఖర్చు అవుతుండగా పైసా ఆదాయం రాదు. అయినా అధికారులు అత్యుత్సాహం చూపడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు సీఎస్‌ఆర్‌ పద్ధతిలో ఏర్పాటు చేయాలని అవగాహన కల్పిస్తే సత్ఫలితం ఉండేదని, బెంగళూర్‌ తరహాలో ఇక్కడా పైసా ఖర్చు లేకుండా పని జరిగేదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. పీవీఎన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మాదిరే గచ్చిబౌలిలో రెండు పిల్లర్లు, హైటెక్‌ సిటీలో మూడు పిల్లర్లకు వర్టికల్‌ గార్డెనింగ్‌ ఏర్పాటు పనులను రూ.56 లక్షలకు ఇస్తూ అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు నిర్ణయించడంపై హెచ్‌ఎండీఏ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తొలి విడతలో కేవలం ఐదు పిల్లర్లను మాత్రమే ఎంచుకున్న అధికారులు... మరిన్ని ప్రాంతాల్లోనూ హెచ్‌ఎండీఏ నిధులతోనే వర్టికల్‌ గార్డెనింగ్‌ పనులు చేయాలని ఆలోచిస్తుండడం ఏమిటనిప్రశ్నిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు