కమ్యూనిస్టు యోధుడు పర్సా కన్నుమూత

23 May, 2015 00:27 IST|Sakshi
కమ్యూనిస్టు యోధుడు పర్సా కన్నుమూత

- పాల్వంచ ఎమ్మెల్యేగా సేవలు.. నేడు కొత్తగూడెంలో అంత్యక్రియలు
 
కొత్తగూడెం:
తొలితరం కమ్యూనిస్టుయోధుడు, సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ(91) శుక్రవారం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కన్నుమూశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంభంపాడుకు చెందిన వెంకట సుబ్బమ్మ, వెంకటరామరాజు దంపతులకు 1924లో ఆయన జన్మిం చారు. సత్యనారాయణ 1940 ప్రాంతంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం వచ్చి కమ్యూనిస్టు యోధులు శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యలతో కలిసి కార్మికోద్యమాలను నిర్మించారు.

రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిం చారు.  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొత్తగూడెం, పాల్వంచ దళాలకు నాయకత్వం వహించారు. నిజాం ప్రభుత్వం ఆయనను జై ళ్లలో నెలల తరబడి బంధించింది. నిజాం సైన్యం ఆయనను కాల్చేయమని ఆజ్ఞాపించినా పోలీస్ అధికారి సహాయంతో ఆయన మరణం నుంచి తప్పించుకున్నారు. 1957లో పీడీఎఫ్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలోని అప్పటి పాల్వంచ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1962లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో సీపీఎం తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

1970లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్(సీఐటీయూ)ను నెలకొల్పి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. సత్యనారాయణకు భార్య భారతీదేవి, ఇద్దరు కుమారులు చక్రపాణి, మురళి, ముగ్గురు కుమార్తెలు వాణి, పద్మశ్రీ, లీల ఉన్నారు. ఐదేళ్లుగా ఏలూరులోని చిన్నకుమార్తె లీల వద్ద ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని ఏలూరు నుంచి కొత్తగూడెం తరలించనున్నారు. శనివారం జరిగే పర్సా అంత్యక్రియల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలు రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు.

సీపీఎం సంతాపం
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ మృతికి సీపీఎం సంతాపం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగిన సంతాపసభలో పర్సా చిత్రపటానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు, కార్మికోద్యమ చరిత్రలోని కీలకమైన ఘట్టాల్లో పర్సా పాత్ర ఉందని రాఘవులు అన్నారు. పర్సా సత్యనారాయణ మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరె డ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. పర్సా మృతి కార్మికవర్గానికి తీరని లోటని నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు