నటుడు దామరాజు కన్నుమూత

4 Oct, 2019 09:12 IST|Sakshi

సినీ, నాటక రంగాల్లో రాణించిన నర్సింహారావు

సాక్షి, ముషీరాబాద్ : సినీ, నాటక రంగాలతో పాటు బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న నటుడు దామరాజు వెంకటలక్ష్మీ నర్సింహారావు (79) బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ప్రముఖ సినీ దర్శకుడు, నాటకరంగ పితామహుడు చాట్ల శ్రీరాములు శిష్యరికంలో ఎదిగిన నర్సింహారావును దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కూడా ప్రోత్సాహించారు. ఈ క్రమంలో దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాతా – మనవడు ద్వారా నర్సింహారావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారసురాలు, కలవారి కుటుంబం, మేనకోడలు, పోస్టుమేన్, కోరుకున్న ప్రియుడు, రాజా,అతడు (పాత చిత్రం)లో నటించారు. 

అనంతరం రుతురాగాలు, ఆనందధార, చదరంగం, అన్వేషిత, సంఘర్షణ తదితర సీరియల్లలో నటించి బుల్లితెరపై ఖ్యాతిగాంచారు. రచయితగా స్త్రీ రూపం, గాంధీ మళ్లీ పుడితే, స్వామియే శరణం, బసమ్మ కథ, ఇంకా రగులుతున్న రావణకాష్టం వంటి నాటకాలను అందించి, దర్శకత్వం కూడా వహించి రాణించారు. ప్రముఖ సినీ హీరో శివాజీ గణేశణ్‌ చేతుల మీదుగా నాటకరంగంలో ఉత్తమ కథనాయకుడిగా అవార్డులను అందుకున్నారు.ఉత్తమ నాటక రచయిత, ఉత్తమ హాస్యనటుడు అవార్డును 2007లో అందుకున్నారు. గాంధీ మళ్లీ పుడితే నాటకానికి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందారు. ఒకవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కంటోన్మెంట్‌ డిపోలో అక్కౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూనే ఇటు నటనలో ​కూడా తనదైన ముద్రవేశారు. పదవీ విరమణ తర్వాత వ్యవసాయ రంగంలోకి దిగి, పూర్తిగా సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండించారు.ఇందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు.నర్సింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా