విశ్రాంత ఐఏఎస్‌ విఠల్‌ కన్నుమూత

20 Jun, 2020 01:29 IST|Sakshi

1950లో ఐఏఎస్‌గా ఎంపిక..  ఉమ్మడి ఏపీలో కీలక పదవులు

నాటి సీఎంలు కాసు, జలగం, పీవీ వద్ద కార్యదర్శిగా విధులు

అంతర్జాతీయ ద్రవ్య నిధి సభ్యుడిగానూ సేవలు 

సాక్షి, జూబ్లీహిల్స్:‌ ప్రముఖ ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బీపీఆర్‌ విఠల్‌ (94) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శేషు విఠల్, కుమారులు సంజయ్‌ బారు, చైతన్య, కుమార్తె నివేదిత ఉన్నా రు. పెద్ద కుమారుడు సంజయ్‌ బారు ప్రముఖ కాలమిస్ట్‌గా పనిచేయడంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వద్ద మీడియా సలహాదారుగా పని చేశారు. ‘ద యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సహా పలు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. శనివారం ఫిలిం నగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

1950లో ఐఏఎస్‌కు ఎంపిక... 
హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన విఠల్‌ మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1950లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1950 కేడర్‌కు చెందిన బీపీఆర్‌ విఠల్‌... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో సేవలు అందించారు. 1972 నుంచి 1982 వరకు ఆయన ఏపీ ప్రణాళికా విభాగానికి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. పదవ ఆర్థిక సంఘం చైర్మన్‌గా సేవలు అందించారు. కేరళ ప్రభుత్వంలో ఎక్స్‌పెండిచర్‌ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు.

విషాద వదనంలో బీపీఆర్‌ విఠల్‌ సతీమణి శేషు విఠల్, కుమార్తె నివేదిత
ప్రణాళికా సంఘం సభ్యుడిగానే కాకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. సూడాన్, మలావీ తదితర దేశాల ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ సర్వీసెస్‌ (సెస్‌) ఏర్పాటు చేయడంలో బీపీఆర్‌ విఠల్‌ ప్రధాన భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళ్‌రావు, పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి వద్ద ప్రభుత్వ కార్యదర్శిగా పని చేశారు. అప్పట్లో ఆయన ‘మెమరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’గా ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల నుంచి మన్న నలు అందుకున్నారు. 

తెలంగాణ ఉద్యమానికి బీజం... 
ఆర్థిక రంగంపై బీపీఆర్‌ విఠల్‌ పలు పుస్తకాలు రచించారు. ఆయన రాసిన ‘ద తెలంగాణ సర్‌ప్లస్‌ఎస్‌: ఎ కేస్‌ స్టడీ’పుస్తకం తర్వాత కాలంలో తెలంగాణా ఉద్యమానికి బీజం వేసిందని చెబుతారు. రిటైర్మెంట్‌ అనంతరం నిజాం ట్రస్ట్, హైదరాబాద్‌ లిటరరీ సొసైటీ, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘా లు, సంస్థలకు ఆయన సేవలు అందించారు. విఠల్‌ తండ్రి ప్రొఫెసర్‌ బీవీ రామనర్సు వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా, నిజాం కాలేజీలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రసి ద్ధ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్య క్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలంపాటు ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విఠల్‌ సేవలందించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఏపీ ప్రణాళిక, అభివృద్ధి మం డలి ఉపాధ్యక్షుడిగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సలహాదారుగా, 10వ ఆర్థిక సంఘం సభ్యుడిగా విఠల్‌ ఉత్తమ సేవలందించా రని కొనియాడారు. బీపీఆర్‌ విఠల్‌ మృతిపట్ల మంత్రి కె. తారక రామారావు తీవ్ర సంతాపం వ్య క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిలదొక్కుకుంటుందా లేదా? అనే అనుమానాలను పటాపంచలు చేసేందుకు ‘తెలంగాణ సర్‌ప్లస్‌ఎస్‌’పుస్తకాన్ని విఠల్‌ రాశారని కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఆయన కుమారుడు, కుటుంబ సభ్యుల కు సానుభూతి తెలియజేశారు. విఠల్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్‌ అధికారులు, విశ్రాంత ఐఏఎస్‌లు సంతాపం తెలిపారు.

బీపీఆర్‌ విఠల్‌ మృతిపై ఏపీ సీఎం జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ మాజీ ప్రభుత్వ కార్యదర్శి, ఐఎంఎఫ్‌(ఇంటర్నేషనల్‌ మానిటరింగ్‌ ఫండ్‌) సలహాదారు బీపీఆర్‌ విఠల్‌ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు