'బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం'

14 Feb, 2017 16:24 IST|Sakshi
'బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం'

హైదరాబాద్‌: బీసీలకు అన్యాయం చేసేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కంకణం కట్టుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు (వీహెచ్‌) అన్నారు. ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఐఐఎం, ఐఐటీలల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. 60 ఏళ్లు గడిచినా బీసీల రిజర్వేషన్స్ 27 శాతం దాటడం లేదన్నారు. బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ క్రిమిలేయర్ విషయం తేల్చకుండా.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని వెంకయ్య మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ కూడా బీసీ ఓట్ల కోసం అప్పుడే రాజకీయాలు మెదలుపెట్టాడని మండిపడ్డారు.

కాంగ్రెస్ కూడా మేలుకోవాలని, బీసీలు పార్టీ నుంచి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. బీసీలను సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీ రిజర్వేషన్స్ పై న్యాయం జరగదని, రిజర్వేషన్స్ రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ఉద్దేశమన్నారు. ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ తో బీజేపీ సర్కార్ నడుస్తోందన్నారు. దామోదరం సంజీవయ్య జయంతిని కేసీఆర్‌ సర్కార్ విస్మరించిందన్నారు. ఒక్క మంత్రి గానీ, అధికారి కానీ సంజీవయ్య జయంతికి రాకపోవడం దారుణమన్నారు. దళితుడైన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని విస్మరించడం.. రాష్ట్రంలోని దళితులను అవమానించడమేనన్నారు.

మరిన్ని వార్తలు