కుట్రతోనే వ్యతిరేకిస్తున్నారు

6 Jan, 2020 02:47 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వీహెచ్‌పీ నేత రాఘవులు

సీఏఏ వ్యతిరేకులపై వీహెచ్‌పీ నేత రాఘవులు

హైదరాబాద్‌: భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చాలనే ఉద్దేశంతోనే పలువురు ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్నారని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు విమర్శించారు. దేశ విభజన నుంచి పాకిస్తాన్‌ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి శరణార్థులు మనదేశానికి వలస వస్తున్నారని వారందరికీ పౌరసత్వం కల్పించాలని గత పాలకులంతా అనుకున్నారు కానీ దాన్ని అమలు చేయలేకపోయారని ఆయన అన్నారు. ఆదివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యాలయంలో రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ.. దేశానికి వలస వచ్చిన వారిని అన్ని పార్టీలు ఆదరించాలని వారి పార్టీల ఎన్నికల అజెండాలలో పొందుపరిచారన్నారు.

ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల ఎన్‌ఆర్‌సీ, సీఏఏ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. గత పాలకుల చేయలేని పనిని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసి చూపించారన్నారు. ప్రపంచ దేశాలను కబలించిన తరహాలోనే భారత దేశాన్ని ఆక్రమించుకునేందుకుగాను జీహాదీలు కుట్ర పన్నుతున్నారని, ఇందులో భాగంగానే మతమార్పిడులు, చొరబాటు, జమీన్‌ కబ్జా, కులాలమధ్య చిచ్చు, హత్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ఆరోపించారు.

చొరబాటుదారుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అస్సోం, త్రిపుర, బెంగాల్, కశ్మీర్‌ వంటి దేశాలతో పాటు అనేక ప్రాంతాలు అశాంతికి గురయ్యాయన్నారు. రాబోయే 35 ఏళ్లలో భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మారుస్తామని ప్రకటించడం చూస్తుంటే చొరబాటుదారుల కుట్ర అర్థమవుతోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటో అత్యధికులకు తెలియదని, నేతల తప్పుడు వ్యాఖ్యలకు ప్రభావితమై వారు రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర నేత బండారి రమేష్, భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌చందర్, రాష్ట్ర నేత పగుడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు