ఒంటరి జీవితాల్లో దీపావళి వెలుగులు

26 Oct, 2019 21:07 IST|Sakshi

వృద్ధాశ్రమంలో దీపావళి వేడుకలు నిర్వహించిన  స్వచ్ఛంద సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: అనాథలు, వృద్ధులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ‘వి ఫర్‌ ఆర్ఫాన్‌’ సంస్థ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. కుటుంబ సభ్యుల నిరాదరణకు లోనై వృద్ధాశ్రమంలో అనాథలుగా కాలం వెళ్లదీస్తున్న దీనుల కళ్లలో కాంతులు నింపింది. ఉప్పల్‌ సమీపం నారపల్లిలో ఉన్న లహరి వృద్ధాశ్రమంలో శనివారం వి ఫర్‌ ఆర్ఫాన్ సభ్యులు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, అనాథ పిల్లలతో దీపావళి పండుగ జరిపించి వారి మోముల్లో చిరునవ్వులు పూయించారు. అంతేకాదు 25 మంది వృద్ధులకు కొత్త బట్టలు అందించారు. స్వయంగా వృద్ధులకు మిఠాయిలు తినిపించి, వారి చేత దీపావళి బాణసంచా కాల్పించి సంతోషాలు పంచారు. తమకెంతో ఇష్టమైన బిర్యానీని కూడా స్వయంగా తినిపించి సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయత చూపడంతో వృద్ధులు కరిగిపోయారు. అందరూ ఉన్న అనాథల్లా గడుపుతున్న తమకు పండుగ ఆనందాన్ని పంచిన వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంబీసీ డీఎస్‌టీ నవనిర్మాణ సమితి రాష్ట్ర కన్వీనర్ బెల్లాపు దుర్గారావు అతిథిగా హాజరయ్యారు. చేర్యాల రాకేశ్‌, చేర్యాల విద్య, యోగిత, ఛార్మ్స్‌ సంపత్‌, హరీశ్‌, మాట్రిక్స్‌ రమేశ్‌, బేగంపేట రాజు, సుశీల్‌, ముకేశ్‌, కిరణ్‌, జైహింద్‌, చందుభాయ్‌, దుర్గాప్రసాద్‌, సింగిరాల శ్రవణ్‌కుమార్‌, నర్సింగ్‌, దొప్పల నరేశ్‌ తదితరులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు