దుండగుల దుశ్చర్యతో కలకలం

13 Mar, 2016 02:32 IST|Sakshi
దుండగుల దుశ్చర్యతో కలకలం

నీటి ట్యాంకర్‌లో విషగుళికలు కలిపిన వైనం
లట్టుపల్లిలో 20మందికి అస్వస్థత
విచారణ చేపట్టిన ఎస్‌ఐ

 
 బిజినేపల్లి : నీటి ట్యాంకర్‌లో దుండగు లు విషగుళికలు కలపడం కలకలం రేపింది. ఈ సంఘటనతో 20మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం బిజినేపల్లి మండలం లట్టుపల్లిలోని మూడు, నాలుగు వార్డుల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అంతకుముందే అందులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుళికలమందు కలపగా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఆ నీటిని తాగిన సునీత, గీత, రాంచరణ్, ప్రవళిక, సోఫియాన్, మహిన్, చిన్న య్య, సూర్యతేజ, జరీనాబేగం, ఊశన్న, అబ్దుల్‌అజీద్‌తోపాటు మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరు వాంతులు చేసుకోవడంతోపాటు కడుపునొప్పితో బాధపడుతుండటంతో వెంటనే 108వాహనంలో బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని (పీహెచ్‌సీ) కి తీసుకెళ్లి వైద్య చికిత్సలు నిర్వహించారు.

అనంతరం ఎంపీపీ ఎద్దుల రాములు బాధితులను పరామర్శించి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి ట్యాంకర్‌ను నిలిపి ఉంచిన చోట వేముల జెన్నయ్య ఇంటి వద్ద పశుగ్రాసంపైనా విషగుళికలు చల్లడంతో అవి తిన్న రెండు కోళ్లు మృతి చెందాయి. కాగా ఈఓపీఆర్‌డీ పండరీనాథ్, సెక్రటరీ జయరాం గ్రామంలో తిరిగి విషం కలిసిన నీటిని పారబోయించారు. ఈ విషయమై పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వీరబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు