-

ఇక వీడియో కాన్ఫరెన్స్‌లు

16 May, 2019 09:06 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌కు జరుగుతున్న ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక ఏర్పాట్లు

జోనల్, సర్కిల్‌ అధికారులతో కమిషనర్‌ సమావేశాలు

జోనల్, డిప్యూటీ కమిషనర్లకు తప్పనున్న ప్రయాణం

తగ్గనున్న ఇంధన వ్యయం...త్వరలో ప్రారంభం

గ్రేటర్‌ పరిధిలోని సర్కిల్, జోనల్‌ అధికారులు...జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. వీరి మధ్య పలు అంశాలపై చర్చలు జరగడం..నిర్ణయాలు తీసుకోవడమూ ముఖ్యమే. ఇందుకోసమే తరుచుగా వీరు సమావేశమవుతుంటారు. అయితే ఈ సమావేశాలు దూరాభారం, సమయం వృథా కావడానికి కారణమవుతుండడంతో గ్రేటర్‌లో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కడి అధికారులు అక్కడే ఉండి...కమిషనర్‌ లేదా ఇతర ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడేలా దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో వీడియో కమ్యూనికేషన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న పాలికామ్‌ కంపెనీ ఉపకరణాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: దాదాపు కోటి జనాభా కలిగిన నగరంలో పెను వర్షాల వంటి విపత్తు సమయాల్లో ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో, ఈవీడీఎం డైరెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌లున్నాయి. వాటి ద్వారా అవసరమైన సందర్భాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని టీవీ తెరలపై వీక్షిస్తూ మేయర్, కమిషనర్, డైరెక్టర్‌లు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 650 చ. కి.మీల మేర విస్తరించిన గ్రేటర్‌ నగరంలో ఆరు జోనల్, 30 సర్కిల్‌ కార్యాలయాలకు, ప్రధాన కార్యాలయానికి నడుమ ఎంతో దూరం ఉంది. ప్రజా సమస్యలపైన, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నగరమంతా అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో దాదాపుగా ప్రతిరోజూ సమావేశం నిర్వహించాల్సి వస్తోంది. ఆయా విభాగాల వారీగానూ సంబంధిత అధికారులతో  నెలకోమారు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.  ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు వారు ఎంతో దూరం నుంచి రావాల్సి రావడంతోపాటు సమావేశం ముగిశాక తిరిగి వెళ్లేందుకు వెరసి కనీసం పూట సమయం పడుతోంది. శేరిలింగంపల్లి, చందానగర్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్‌ వంటి ప్రాంతాల నుంచి  ప్రధాన కార్యాలయానికి వచ్చేందుకే  ట్రాఫిక్‌ రద్దీలో గంట నుంచి రెండు గంటల సమయం పడుతోంది.  దీంతో వారు  స్థానికంగా చేయాల్సిన పనులకు ఆటంకాలెదురవుతున్నాయి.

‘స్థానిక’ సమస్యలు విన్నవించుకునేందుకు సర్కిల్, జోనల్‌ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు  జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కమిషనర్‌తో సమావేశానికి వెళ్లారనే సమాధానం  వినిపిస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని వారు కమిషనర్‌తో సమావేశానికి వెళ్లినా, మరెక్కడికి వెళ్లినా కార్యాలయాల్లోని సిబ్బందికి మాత్రం హెడ్డాఫీసుకు వెళ్లారని చెప్పడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో  కమిషనరే జోనల్‌ కార్యాలయాలకు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈమేరకు ఆయన సమయం హరించుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎవరికీ టైమ్‌ వృథా కాకుండా ఉండేందుకు ఎక్కడి అధికారులు అక్కడే ఉండి తమ కార్యాలయాల నుంచే సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో వీడియో కమ్యూనికేషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న పాలికామ్‌ కంపెనీ ఉపకరణాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా స్పష్టమైన దృశ్యం, వాయిస్‌ ఉండటంతో  ఎవరెక్కడ ఉన్నా అందరూ ఒకేచోట ఉన్నట్లు సమావేశాలకు వీలుండటంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంతోపాటు ఈవీడీఎం డైరెక్టర్‌ కార్యాలయంలోనూ, 17 జోనల్‌/సర్కిల్‌ కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో 6 జోన్లు, 30 సర్కిళ్లు ఉన్నప్పటికీ, జోనల్‌ కార్యాలయంతోపాటు రెండు, మూడు సర్కిళ్లు ఒకే భవనంలో ఉన్నవి ఎన్నో ఉన్నాయి. ఇలా అన్ని జోనల్, సర్కిల్‌ కార్యాలయాలు 17 భవనాల్లోనే ఉండటంతో 17 చోట్ల ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆయా భవనాల్లోని కార్యాలయాల్లో ఉండే జోనల్, సర్కిల్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల అధికారులకు ఎంతో సమయం కలిసి రావడమే కాక, వారి వాహనాల ఇంధన వ్యయమూ తగ్గనుంది. వారికి ప్రయాణ బడలిక కూడా తప్పనుంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ నగరంలో కోటి జనాభా సమస్యలు తీర్చే.. భవన నిర్మాణ అనుమతులతోపాటు ఓసీలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే జారీ చేస్తున్న.. దేశంలోనే ఈ ఆఫీస్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేక పోవడమే ఆశ్చర్యంగా భావిస్తున్నవారూ ఉన్నారు. 

మరిన్ని వార్తలు