ఆవిర్భావ వేడుకలు అదరగొట్టాలి

21 May, 2016 02:35 IST|Sakshi
ఆవిర్భావ వేడుకలు అదరగొట్టాలి

వీడియో కాన్ఫరెన్‌‌సలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని తెలిపారు. వివిధ రంగాలలో కృషి చేసిన 25 మంది ప్రముఖులను గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్ధీకరించాలని, ఆస్పత్రులు, వసతి గృహాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని సూచించారు. రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ముఖ్యమైన హోటళ్లలో తెలంగాణ వంటకాలు సరఫరా చేసేలా చూడాలని, కవి సమ్మేళనాలు, సెమినార్‌లు, డిబేట్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేయాలని, ఉదయం క్రీడాకారులతో తెలంగాణ రన్, సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను విద్యుద్దీపాలతో అలంకరించి స్వీట్లు పంపిణీ చేయాలని, ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన అంశాలను తెలియజేస్తూ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించాలని, దీపం, ఆసరా పింఛన్లతో పాటు ఉపాధిహామీ కూలీలకు కూడా స్వీట్లు పంపిణీ చేసేలా చూడాలని అన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని, అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురు ద్వారాలు అలంకరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ మొదలుకొని జిల్లాస్థాయి వరకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని, అన్ని గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్, పంచాయతీ భవనాలకు సున్నం వేయించాలని, ఐకేపీ మహిళా సంఘాలను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ శాఖ కార్యదర్శి ఎస్‌పీ సింగ్ తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని అదేశించారు.

వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం

కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ప్రముఖులకు అవార్డులు ఇచ్చేందుకు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణకు అవార్డుల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శానిటేషన్ డ్రైవ్‌తో పాటు అవతరణ దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాన్ఫరెన్స్‌కు రాష్ట్రస్థాయి నుంచి రేమండ్ పీటర్, మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎంజీ గోపాల్ పాల్గొనగా జిల్లా నుంచి అదనపు జాయింట్ కలెక్టర్ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్‌డీఏ, డ్వామా పీడీ మధుసూదన్ నాయక్, దామోదర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు