బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది: విద్యాసాగర్‌రావు

16 Sep, 2019 19:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మళ్ళీ బీజేపీలోకి రావడం ఉత్సాహం, ప్రేరణ కల్గిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కేంద్ర బిందువుగా మారుతుందని.. టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతుందన్నారు. మొన్నటి వరకు గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌రావు పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకి లక్ష్మణ్‌ బీజేపీ సభ్వతాన్ని ఇచ్చారు. పార్టీ సభ్యత్వం స్వీకరించిన అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘పార్టీ కార్యకర్తల శ్రమ వల్లనే ఎదిగాను. బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంపై బలహీనమైన ఆలోచనలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో 17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి బీజేపికి పూర్తిగా అంకితమవుతాను. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని’ విద్యాసాగర్‌ రావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంలో విద్యాసాగర్ రావు పాత్ర కీలకమని గుర్తు చేశారు. తన సలహాలు, అనుభవాలు పార్టీకి అవసరమన్నారు. టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ భవన నిర్మాణంపై కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టుగా అభివర్ణించారు.

మరిన్ని వార్తలు