హైదరాబాద్‌ దేశ రెండో రాజధాని కావొచ్చు: మాజీ గవర్నర్‌

5 Nov, 2019 15:27 IST|Sakshi

హైదరాబాద్‌ : ఒకానొక సందర​ర్భంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు కొంతకాలం పాటు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ప్రతిపాదలేవి కేంద్రం దగ్గర లేవని కేంద్ర మంత్రులు వివరణ ఇవ్వడంతో ఆ పుకార్లకు తెరపడింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాలుష్య తీవ్ర దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్‌ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని వ్యాఖ్యానించారు. తెలుగు వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డా. శ్రీధర్ రెడ్డి రచించిన 'శ్రీధర్ కవితా ప్రస్థానం' అనే కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పని చేసిన విద్యాసాగర్ రావు ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు