విజిలెన్స్ ఎస్పీ లంచావతారం బట్టబయలు

12 Jan, 2017 15:11 IST|Sakshi
విజిలెన్స్ ఎస్పీ లంచావతారం బట్టబయలు
ఆయన ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ శాఖలో ఎస్పీ ర్యాంకులో ఉన్న అధికారి. కానీ అలాంటి వ్యక్తే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అది కూడా చిన్నా చితకా కాదు.. లక్ష రూపాయలు! నల్లగొండ విజిలెన్స్ ఎస్పీ భాస్కర్‌రావు తన ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. 12 మంది రైస్ మిల్ వ్యాపారులను ఆయన గత కొంత కాలంగా లంచం డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తాను వచ్చి ఇన్‌స్పెక్షన్ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందేని ఆయన తరచు డిమాండ్ చేస్తున్నట్లు మిల్లర్లు తెలిపారు. 
 
అసలే పెద్దనోట్ల రద్దుతో తమ వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే.. మద్యలో ఈ లంచాల గొడవేంటని తలపట్టుకున్న రైస్ మిల్లర్లు, చివరకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లర్ల సంఘానికి చెందిన భద్రాద్రి అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం భాస్కర్‌రావు తన ఇంట్లో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా వలపన్నిన ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భాస్కర్‌రావు సొంత జిల్లా అయిన వరంగల్‌లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. విజిలెన్స్ శాఖలోనే.. అది కూడా ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి ఇలా పట్టుబడటం సంచలనాన్ని సృష్టించింది.