ప్రభుత్వ డెయిరీ బేజారు

29 Sep, 2017 09:07 IST|Sakshi

2015 జూలైలో.. 4.23  లక్షల లీటర్లు

ఇప్పుడు  3.28  లక్షల లీటర్లు

దారుణంగా పడిపోతున్న విజయ పాల విక్రయాలు

ఏడాదిలోనే తగ్గిన పాల ఉత్పత్తుల అమ్మకాలు (రూ.ల్లో) 61,00,00,000

రైతులకు ప్రోత్సాహకమిస్తున్నా పడిపోయిన పాల సేకరణ

ప్రైవేటు డెయిరీలతో అధికారుల లాలూచీ వల్లేనని విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ :  ఏడాదికేడాదికి విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయాలు దారుణంగా పడిపోతున్నాయి. గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన అమూల్, కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందినీ డెయిరీలు రాకెట్‌లా దూసుకుపోతుంటే.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ మాత్రం నిర్లక్ష్యపు మాటున చిక్కుకొని విలవిల్లాడుతోంది. డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నా.. పాల సేకరణ దారుణంగా పడిపోతోంది. అధికార యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాల డెయిరీలతో కొందరు విజయ డెయిరీ అధికారుల లాలూచీ కూడా విక్రయాలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు.

రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నా..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీల పాల విక్రయం రోజుకు 26 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. అందులో విజయ డైయిరీ 3.28 లక్షల లీటర్లు మాత్రమే విక్రయిస్తోంది. మూడేళ్ల క్రితం 5.5 లక్షల లీటర్లు విక్రయించింది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నా విక్రయాలు పడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015 జూలైలో విజయ పాల విక్రయాలు 4.23 లక్షల లీటర్లుంటే.. ఇప్పుడు 3.28 లక్షల లీటర్లకు పడిపోయాయి.

నెయ్యి, వెన్న, పన్నీర్, మజ్జిగ, లస్సీ తదితర పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2015–16లో 12 రకాల పాల ఉత్పత్తుల విక్రయాలు రూ.179.84 కోట్లుంటే.. 2016–17లో వాటి విక్రయాలు రూ.118.67 కోట్లకు పడిపోయాయి. అంటే ఏకంగా రూ.61.17 కోట్ల విక్రయాలు తగ్గాయి. అందులో నెయ్యి అమ్మకాలు గణనీయంగా పడిపోవడం గమనార్హం. 2015–16లో నెయ్యి విక్రయాలు రూ. 106.73 కోట్లు కాగా.. 2016–17లో రూ.86.83 కోట్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.


రూ.30 కోట్ల విలువైన బటర్, పొడి వృథా
తెలంగాణలో అదనంగా ఉండే పాలను పాల పొడి, బటర్‌ తయారు చేసేందుకు గతేడాది జనవరిలో ఒంగోలులోని సంగం డెయిరీకి పంపారు. పాల ద్వారా 849 టన్నుల పౌడర్, 325 టన్నుల వైట్‌ బటర్‌ తయారైంది. ఏడాదైనా తీసుకురాకుండా రూ.28 కోట్ల విలువైన పొడి, బటర్‌ను అక్కడే వదిలేశారు. తీరా ఇప్పుడు వాటి గడువు తీరిపోయింది.అలాగే గుంటూరులోని ఓ డెయిరీలో రూ.2.10 కోట్ల విలువైన 18 టన్నుల పొడి, 9.75 టన్నుల బటర్‌ తయారైంది. దాన్ని కూడా అక్కడ్నుంచి తీసుకురాకపోవడంతో గడువు తీరిపోయింది. ఇలా రూ.30 కోట్ల విలువైన బటర్, పాల పొడి వృథా అయింది. మన పాలతో తయారు చేసిన పాలపొడిని, బటర్‌ను ఒంగోలు, గుంటూరుల నుంచి తీసుకురాకుండా మరోవైపు ప్రైవేటు సంస్థల వద్ద ఉండే పాలపొడి, బటర్‌ను సేకరించేందుకు టెండర్లు పిలవడం విమర్శలకు దారితీసింది.

ఆ పథకంతో రూ.3 కోట్ల నష్టం
విజయ పాల విక్రయాలను పెంచడానికి డెయిరీ యాజమాన్యం ఓ పథకం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం 12 లీటర్ల బాక్సుకు ఒక లీటరు పాలను ఏజెంట్లకు ఉచితంగా సరఫరా చేసింది. అలా ప్రతిరోజూ 8 నుంచి 10 వేల లీటర్ల పాలను ఏజెంట్లకు అప్పనంగా పంచిపెట్టింది. దీంతో సంస్థకు ఏకంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. అలా చేసినా అమ్మకాలు పెరిగాయా అంటే పెరగలేదు. సరికదా అంతకుముందు కంటే 20 వేల లీటర్ల వరకు తగ్గిపోయినట్లు డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు చెల్లించాల్సిన పాల సొమ్మును కూడా నెలల తరబడి ఆపేస్తుండటంతో వారు ప్రైవేటు డెయిరీల వైపు తరలిపోతున్నారన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు