‘విజయా’వారి మాయాబజార్‌

26 Dec, 2017 01:15 IST|Sakshi

లీటరు అంటే 755 గ్రాములే!

  • తక్కువ తూకం ప్యాకెట్లను విక్రయిస్తున్న అధికారులు 
  • మిగుల్చుకున్న నూనెలను అక్రమంగా అమ్ముకుంటున్న వైనం
  • ఏటా రూ. కోట్లలో అక్రమ సంపాదన.. ఉన్నతాధికారులకూ వాటా!

సాక్షి, హైదరాబాద్‌
ఆయిల్‌ఫెడ్‌లో ఆయిల్‌ దందా ఏరులై పారుతోంది. వినియోగదారులను మోసగిస్తూ ఇష్టారాజ్యంగా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లి ఆయిల్‌ ప్యాకింగ్‌ యూనిట్‌లో కల్తీ వ్యవహారం వెలుగుచూడగా, తాజాగా తక్కువ తూకం ఉన్న ప్యాకెట్లను వినియోగదారులకు అంటగట్టడంపై విమర్శలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ గతంలో అనేకసార్లు కేసులు పెట్టి జరిమానాలు విధించినా దందాను ఏమాత్రం ఆపడంలేదు. ఓవైపు సంస్థ నుంచి జరిమానాలు చెల్లిస్తూ.. మరోవైపు ఇష్టారాజ్యంగా తక్కువ తూకం ప్యాకెట్లను వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ప్యాక్‌ చేసినవి కావడంతో వినియోగదారులు వాటిని కొలిచి తీసుకోరు. దీన్నే కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. మిగుల్చుకున్న నూనెలను అక్రమంగా అమ్ముకుంటూ నెలకు రూ.లక్షల్లో దందా చేస్తున్నారు. అందులో ఒకటీరెండు వాటాలు ఉన్నతాధికారులకు వెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి.

కిలోకు 150 గ్రాములు తక్కువ..
విజయ నూనెపై ప్రజల్లో నమ్మకముంది. ప్రభుత్వ సంస్థ ద్వారా విక్రయిస్తున్నందున ప్రజలు గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ వారి నమ్మకాన్ని సంస్థలో కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయిల్‌ఫెడ్‌ సంస్థ నెలకు 2,600 టన్నుల విజయ నూనెలను విక్రయిస్తుంటుంది. అందులో వెయ్యి టన్నులు పామాయిల్, వెయ్యి టన్నులు పొద్దు తిరుగుడు, 500 టన్నులు వేరుశనగ, 100 టన్నుల రైస్‌బ్రాన్‌ నూనెలు అమ్ముతుంది. వీటిలో 1,100 టన్నుల నూనెలను కృష్ణపట్నంలో, 1,500 టన్నులు శివరాంపల్లి వద్ద ప్యాకింగ్‌ చేస్తున్నారు. వినియోగదారుల కోసం 15 లీటర్లలో, 15 కేజీల్లో వేర్వేరుగా డబ్బాల్లో విక్రయిస్తున్నారు. ఇక వాస్తవానికి లీటర్‌ ప్యాకెట్లలో 915–920 గ్రాములతో నూనె విక్రయిస్తున్నారు. అయితే లీటర్‌ ప్యాకెట్లలో కేవలం 755 గ్రాములే ప్యాకింగ్‌ చేస్తున్నట్లు ఇటీవల ఆయిల్‌ఫెడ్‌ అధికారులకు ఫిర్యాదులందాయి. డబ్బాల్లో విక్రయించే నూనెలోనూ తక్కువ తూకమే ఉంటున్నట్లు సమాచారం.

శివరాంపల్లిలోనే..
ముఖ్యంగా శివరాంపల్లిలో ప్యాకింగ్‌ అవుతున్న వాటిలోనే తక్కువ తూకం ఉంటున్నట్లు తేలింది. ఆ సంస్థ వివిధ రకాల నూనెలు నెలకు 2,600 టన్నులు విక్రయిస్తుండగా, తక్కువ తూకంతో దాదాపు 150 టన్నుల వరకు కొందరు అధికారులు మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో కేసులు నమోదైనా అధికారుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయిల్‌ఫెడ్‌ మాజీ ఉద్యోగి, ఆ సంస్థ యూనియన్‌ మాజీ నాయకుడు నర్సింహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కేసులు పెడితే సంస్థ తరఫున డబ్బులు చెల్లించి మళ్లీ దందా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాటాలు ఉన్నతాధికారులకూ చేరుతున్నాయని ఆరోపించారు.

ఫిర్యాదులు అందలేదు: రాజేశం, మేనేజర్, ఆయిల్‌ఫెడ్‌
విజయ నూనెలు తక్కువ తూకంతో ప్యాకింగ్‌ అవుతున్నట్లు తమకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయిల్‌ఫెడ్‌ విజయ నూనెల మార్కెటింగ్‌ మేనేజర్‌ రాజేశం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లీటరు ప్యాకెట్లో 915–920 గ్రాములు ఉంటుందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా