'మహిళ సీఎం ఎవరనేది అధిష్టానం చూసుకుంటుంది'

27 Apr, 2014 11:38 IST|Sakshi
'మహిళ సీఎం ఎవరనేది అధిష్టానం చూసుకుంటుంది'

తెలంగాణ తొలి సీఎంగా మహిళను నియమిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతి ఆదివారం స్పందించారు. తెలంగాణ తొలి సీఎంగా మహిళను నియమిస్తామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరు సీఎం అనేది మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని విజయశాంతి స్పష్టం చేశారు.

ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాములమ్మ తన ఎన్నికల ప్రచారంలో ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఆదివారం మెదక్ అసెంబ్లీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలతో ఆమె మాట్లాడారు. మెదక్ ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనులే తనను విజయతీరాలకు చేరుస్తాయని రాములమ్మ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు మెదక్ జిల్లా ఆంధోల్లో పాల్గొనే సభకు ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు.  

తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన పలు బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తెలంగాణ సీఎంగా మహిళను నియమిస్తామంటూ ప్రకటించారు. దాంతో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న విజయశాంతికి స్థానిక ప్రజలు ఆ మహిళ సీఎం నివేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 

ఆ ప్రశ్నల వర్షంలో రాములమ్మ తడిసి ముద్దవుతున్నారు. ఇక తప్పదని విజయశాంతి ఆదివారం స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ మహిళ మంత్రులు ఉన్నారని చెప్పారు. అదికాక మహిళ సీఎం ఎవరనేది కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందంటూ ప్రజలకు సమాధానం చెబుతూ తన ప్రచారంతో రాములమ్మ ముందుకు సాగుతున్నారు.

మరిన్ని వార్తలు