ఫాంహౌస్‌ పాలనను పాతరేయండి:పొన్నం

18 Nov, 2018 15:10 IST|Sakshi
పొన్నంను గెలిపించాలని కోరుతున్న విజయశాంతి 

 సాక్షి, కరీంనగర్‌: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మహాకూటమిగా జట్టు కట్టామని, దళిత బహుజనులను దగా చేసిన టీఆర్‌ఎస్‌ ఫాంహౌస్‌ పాలనకు చరమగీతం పాడాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టివిక్రమార్క, స్టార్‌క్యాంపెయినర్‌ సినీ నటి విజయశాంతి పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ఆగమైందన్నారు.నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమి అధికారంలోకి రావాలంటే తమ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండాపోయిందని అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, దీనికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపరిధిలోని నేరెళ్ల, మంథని, బొంపల్లి ఘటనలు నిదర్శనం అన్నారు.
కాంగ్రెస్‌ హయాంలోనే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి నేటి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కాళేశ్వరం వరకు చేపట్టామని, కొత్తగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదని, ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయలేదని, కాళేశ్వరంపై ఆర్భాటం చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు.కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తమదేనని అన్నారు. విద్యారంగాన్ని అధోగతి పాలుచేసి కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దాసోహమైన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రతి ఒక్కరు ఆండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శ్రీనివాసన్‌కృష్ణన్‌ మాట్లాడుతూ... నిరంకుశపాలన అంతం కోసం మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కరీంనగర్, మానకొండూర్‌ అసెంబ్లీ అభ్యర్థులు పొన్నం ప్రభాకర్, ఆరెపల్లి మోహన్‌లు మాట్లాడుతూ... ప్రభుత్వ మార్పుకోసం విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రైవేటు విద్యా సంస్థల పక్షాన మహాకూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. టీపీజేఎంఏ రాష్ట్ర అద్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ... వజ్ర సంకల్పంతో లక్ష్యాన్ని ఎంచుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కడారు అనంతరెడ్డి మాట్లాడుతూ... మహాకూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని, రానున్న రోజుల్లో అన్నివర్గాలకు సమన్యాయం చేసే ప్రభుత్వం రాబోతుందని అన్నారు. నాయకులు చల్మెడ లక్ష్మినరసింహరావు, కేజీ టు పీజీ విద్యాసంస్థ ప్రతినిధులు వి.రవీందర్‌రెడ్డి, జె.ప్రభాకర్‌గౌడ్, వేణు, సతీష్, ప్రకాశ్, వీరశేఖర్, మునీందర్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
కాంగ్రెస్‌లో చేరికలు... 
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కొరివి వేణుగోపాల్, డాక్టర్‌ బీఎన్‌ రావ్‌లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ ప్రచారకమిటీ చైర్మన్‌ బట్టి విక్రమార్క, సినీ నటి విజయశాంతిలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
తెలంగాణాకు నాలుగున్నరేళ్ల గ్రహణం
మానకొండూర్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణాకు నాలుగున్నరేళ్లు గ్రహణం పట్టిందని విజయశాంతి ఆరోపించారు. మానకొండూర్‌ నియోజకవర్గ కేంద్రంలోని చెరువు కట్ట వద్ద కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌కు మద్దతుగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ బట్టి విక్రమార్కతో కలిసి ప్రచా రంలో పాల్గొన్నారు. తెలంగాణను పాలించమని కేసీఆర్‌ను గెలిపిస్తే.. చేతకాక నాలుగున్నరేళ్లకే పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేజీ టు పీజీ అమలు చేస్తామని ఆరువేల పాఠశాలలు మూసివేశారని అన్నారు.
మీ ఇంటిబిడ్డ అయిన ఆరెపల్లి మోహన్‌ను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు.  భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఆరెపల్లి మోహన్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, శాసన సభ్యుడిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. నాయకులు కవ్వంపల్లి సత్యనారాయణ, యాళ్ల వెంకటరెడ్డి, గంప వెంకన్న, కేతిరెడ్డి దేవేందర్‌రెడి, పెండ్యాల రాంరెడ్డి, ఆరెల్లి సంపత్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

   

>
మరిన్ని వార్తలు