విజయ్‌కుమార్‌కు అశ్రునివాళి

13 Oct, 2014 00:33 IST|Sakshi
విజయ్‌కుమార్‌కు అశ్రునివాళి

అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
 
కరీంనగర్: అనారోగ్యంతో మృతి చెందిన సీని యర్ జర్నలిస్టు, జీవగడ్డ సాయంకాలం పత్రిక సంపాదకుడు బి.విజయ్‌కుమార్ అంత్యక్రియ లు ఆదివారం ఘనంగా జరిగాయి. శనివారం ఆయన చనిపోయారనే విషయం తెలియగానే వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. విజయ్‌కుమార్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం రాత్రి నుంచి కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఉంచారు. బస్సుయాత్ర సందర్భంగా జిల్లాకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం అక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి, అంజలి ఘటించారు. అశ్రునయనాల మధ్య నగరంలో అంతిమయాత్ర, అంత్యక్రియలు నిర్వహించారు. అంతి మయాత్రలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్, విసరం నేత వరవరరావు, రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ,  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరె డ్డి భాస్కర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. ఎంతో మంది జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌కుమార్ మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. 1971లో విద్యుల్లత సాహిత్య పత్రికను చాలాకాలం తన సంపాదకత్వంలో నిర్వహించారని, ఎమర్జెన్సీ కాలంలో పోలీసుల చిత్రహింసలు, 20 నెలల జైలుశిక్ష అనుభవించిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి జర్నలిస్టులు, ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

అద్దె ఇల్లు.. ఆరుబయటే వీడ్కోలు

విజయ్‌కుమార్ కరీంనగర్‌లోని గణేష్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్య సబిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రీనా ఆయన చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. విజయ్‌కుమార్ పార్కిన్‌సన్ వ్యాధితో అయిదేళ్ళుగా మంచానికే పరిమితిమయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం విషమించటంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఆయన కన్నుమూశారు. అద్దె ఇల్లు కావటంతో మృతదేహాన్ని జర్నలిస్టులు నేరుగా ప్రెస్‌క్లబ్‌కు తరలించారు. అంతిమ సంస్కారాల తర్వాత ఆయన కుటుంబీకులు, బంధువులకు ప్రెస్‌క్లబ్‌లోనే విడిది ఏర్పాటు చేశారు.
 
 

మరిన్ని వార్తలు