సెల్‌ఫోన్‌.. సాక్ష్యంగా!

27 Jan, 2019 03:19 IST|Sakshi

రాజస్తాన్‌లోని మారుమూల గ్రామం అల్వార్‌లో పెహ్లూ ఖాన్‌ అనే 55 ఏళ్ల వృద్ధుడిని కొందరు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 

ఈ రెండు ఘటనలు బయటి ప్రపంచానికి తెలిసిందీ.. బాధితులకు న్యాయం జరిగిందీ సెల్‌ఫోన్ల వల్లే. ఇది నిజం.. ఈ ఘటనలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి దాన్ని సామాజిక మాధ్యమంలో పెట్టడంతోనే అందరికీ తెలిసింది. ఆ వీడియో ఆధారంగానే రాజస్తాన్‌ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు ఉన్నాయి.  సెల్‌ఫోన్లు బాధితులకు సహాయం చేయడానికి, న్యాయపోరాటానికి కూడా ఉపయోగపడతాయని నిరూపితమవుతోంది. తమ ఎదురుగా ఏదైనా ప్రమాదం జరిగినా, అన్యాయం జరుగుతున్నా వెంటనే సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. వాటి ఆధారంగా పోలీసులు, ప్రభుత్వాధికారులు వెంటనే స్పందిస్తున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేస్తున్నా అవి ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లోనే ఉంటున్నాయి.

పల్లె లు, శివారు ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. అలాంటి చోట్ల సెల్‌ఫోన్లే సీసీ కెమెరాలుగా పని చేస్తున్నాయి. గతంలో ఏవైనా గొడవలు, ప్రమాదాలు జరిగినా జనం అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇప్పుడు అలా కాకుండా తమ దగ్గరున్న ఫోన్లతో ఆ ఘటనలను చిత్రీకరించి ప్రపంచానికి తెలుపుతున్నారు. దీనివల్ల చాలా మందికి న్యా యం జరుగుతోంది. పలువురు నిందితులు పట్టుబడుతున్నారు. కొన్ని రోజుల కింద మధ్యప్రదేశ్‌లో ఓ రైతు.. కలెక్టర్‌ కాళ్లమీద పడి బతిమాలుతున్న వీడియో వైరల్‌ అయింది. ఆ దృశ్యం ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ కలెక్టర్‌ను మందలించడమే కాకుండా 2 గంటల్లో రైతుకు న్యాయం చేశారు. 

సెల్‌ఫోన్‌ వల్ల పోలీసులు నిందితులను పట్టుకోగలుగుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేస్తున్నారు. కోర్టులు కూడా కొన్ని సార్లు వీటిని సాక్ష్యాలుగా పరిగణిస్తున్నాయి. ఈ వీడియోల వల్ల ఎక్కువగా సామాన్యులు, బడుగు వర్గాల వారికి న్యాయం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. సెల్‌ఫోన్లు బాధితులకు న్యాయం చేస్తున్నా మరోవైపు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. కళ్ల ముందు ప్రమాదం లేదా నేరం జరుగుతుంటే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయకుండా ఫోన్‌లో చిత్రీకరించడానికి జనం ప్రాధాన్యం ఇస్తున్నారని, దీంతో ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి.. చికిత్స కోసం వచ్చిన ఒక దివ్యాంగుడికి వీల్‌ చైర్‌ ఇచ్చేందుకు వార్డుబోయ్‌ నిరాకరించాడు. లంచం ఇవ్వకపోవడమే దీనికి కారణం. దాంతో ఆ రోగి చిన్న పిల్లలు ఆడుకునే మూడు చక్రాల సైకిలు తెచ్చి ఆస్పత్రి చుట్టూ తిరిగాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విషయం తెలిసిన ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ జరిపి లంచం అడిగిన సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆ ఆస్పత్రికి కొత్తగా 30 వీల్‌చైర్లు ఇచ్చింది. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి ఆ దివ్యాంగుడికి కొత్త వీల్‌చైర్‌ అందజేసింది. 

మరిన్ని వార్తలు