సమస్యలతో సతమతం

19 Feb, 2018 16:18 IST|Sakshi
 కోపగూడ గ్రామం

కోపగూడలో రాజ్యమేలుతున్న సమస్యలు

కానరాని డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

వాంకిడి : గిరి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అవి క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాలకు చేరడం లేదు. నేటికీ ఆ గ్రామాలు అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నా యి. పాలకులు మారుతున్నా గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. దీనికి నిదర్శనం మండలంలోని వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో కోపగూడ.

 
పారిశుధ్యం అస్తవ్యస్తం...


గ్రామంలో 30 కుటుంబాకు వంద వరకు జనాభా ఉంది. ఈ గ్రామంలో ఉన్న నాలుగు చేతిపంపుల్లో మూడు మాత్రమే పని చేస్తున్నాయి. అవి కూడా సరిగా పని చేయడం లేదు. గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు లేక పోవడంతో గ్రామంలో పారిశుధ్యం లోపించిందని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలంలో రోడ్లు, ఇంటి పరిసరాలు బురదగా మారడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గ్రామానికి సందర్శించిన ప్రజా ప్రతినిధులు గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చెప్పిన వారు నేడు గ్రామాన్ని తొంగి కూడా చూడడం లేదని ఆరోపిస్తున్నారు. 


ఏళ్ల తరబడి పారిశుధ్య పనులు నిల్‌!


గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టక పోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుధ్యం లోపించిదని గ్రామస్తులు చెబుతున్నారు. నెలల తరబడి పారిశుధ్య పనులు చేపట్టక పోవడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు సంక్రమిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు గ్రామ సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.


సీసీ రోడ్లు నిర్మించాలి


గ్రామంలో అంతర్గ రోడ్లు, డ్రెయినేజీలు లేక పోవడంతో గ్రామంలో పారిశుధ్యం లోపిస్తోంది. వర్షాకాలంలో ఇంటి నుంచి కాలు బయట పెట్టలేక పోతున్నాం. చాలా ఇబ్బందిగా మారింది. ఎన్నికల సమయంలో గ్రామనికి వచ్చిన నాయకులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పటివరకు ఒక్క రోడ్డు గాని డ్రెయినేజీ గాని నిర్మాణం జరగలేదు.
మడావి భీంరావు, గ్రామస్తుడు


పారిశుధ్య పనులు చేపట్టాలి


గ్రామంలో పారిశుధ్యం లోపించి దుర్గంధం వ్యాపిస్తోంది. నెలల తరబడి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో గ్రామంలో పారిశుద్ద్యం లోపించడంతో గ్రామస్తులు రోగాల భారీన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను గుర్తించి గ్రామంలో ఎప్పటికప్పుడు పారశుధ్య పనులు చేపట్టాలి. గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలి.
–  సిడాం మెంగు, గ్రామస్తుడు


సమస్యలు తెలుసుకుంటా


గ్రామ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తా. సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల కోసం అధికారులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తా. నిధులు మంజూరు కాగానే గ్రామంలో సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం విడతల వారీగా మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తోంది. నిధులు రాగానే పనులు చేపట్టి గ్రామస్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం.
అర్జున్‌పవార్,  ఈవోపీఆర్డీ, వాంకిడి  

మరిన్ని వార్తలు