గ్రామపంచాయతే.. ఆ అవ్వ ఇల్లు!

16 Jul, 2017 04:28 IST|Sakshi
గ్రామపంచాయతే.. ఆ అవ్వ ఇల్లు!
అందరూ ఉన్నా అనాథగా.. తలదాచుకుంటున్న వృద్ధురాలు 
 
సిరిసిల్ల: అందరిలానే ఆ తల్లి ఎన్నో కలలుగన్నది.. ప్రయోజకులైన ఇద్దరు కొడుకులు, కూతురు ఇక తనకు మలిసంధ్యలో ఏ లోటూ రానివ్వరని భరోసా తో ఉంది.. కానీ, ఆమె కలలు కల్లలయ్యాయి. బతుకుదెరువు కోసం కుమారులు స్వగ్రామం విడిచివెళ్లి ఆమె బాగోగులు పట్టించుకోవడం మానే శారు. దీంతో ఆ వృద్ధురాలికి గ్రామపంచాయతీ కార్యాలయమే ఆవాసమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడూరు గ్రామానికి చెందిన మల్లెపూల లచ్చమ్మ (70)కు కుమారులు బాలయ్య, శ్రీనివాస్, కూతురు సుశీల ఉన్నారు. లచ్చమ్మ భర్త నారాయణ పదేళ్ల క్రితమే మృతి చెందాడు. ఉపాధికోసం పెద్ద కుమారుడు బాలయ్య చీకోడులో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు శ్రీనివాస్‌ నిజామా బాద్‌లో ఉంటున్నాడు. లచ్చమ్మ ఇల్లు నాలుగేళ్ల క్రితమే శిథిలమై కూలిపోయింది. తన బాగోగులు చూసుకోవాలని కుమారులను కోరినా.. ఎవరూ పట్టించుకోలేదు.

తన ఊర్లోనే ఉంటున్న కూతురు సుశీల ఇంట్లో మొన్నటివరకు ఉంది. కూతురు పేదరికంలోనే మగ్గడంతో తనను పోషించాలని మళ్లీ తన కుమారులను వేడుకుంది. అయినా ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై ప్రవీణ్‌.. ఆమె కుమారులకు సమాచా రం అందించినా ప్రయోజనం లేకపోయింది. విసిగిపోయిన లచ్చమ్మ.. కూతురును ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వీధిలోనే నివాసం ఉంటూ ఎవరైనా ఓ ముద్ద పెడితే తింటూ ఉంటోంది. ఆమె దీనస్థితిని చూసి చలించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ చీటి వెంకటనర్సింగరావు, గ్రామస్తుడు కిషన్‌ కలిసి లచ్చమ్మను చేరదీశారు.

వానకాలం.. అదీ ఒంటరిగా వీధిలో ఉండడం సరికాదని, ఆమెను పోషించాలని కుమారులకు సమాచారం చేరవేశారు. అయినా వారు గూడూరు రాలేదు. అంతేకాదు.. లచ్చమ్మను చేరదీసిన తమ సోదరి సుశీలను సైతం వారు దూషించారు. విధిలేని పరిస్థితిలో లచ్చమ్మకు గ్రామపంచాయతీ కార్యా లయంలోని ఓ గది కేటాయించారు. దీంతో గత పదిరోజులుగా ఆమె అక్కడే జీవనం సాగిస్తోంది. గ్రామస్తులు పెట్టే భోజనం తింటోంది. కలెక్టర్‌ స్పందించి తనను ఆదుకోవాలని, తన కుమారులకు బుద్ధి చెప్పాలని ఆ వృద్ధురాలు వేడుకుంటోంది.   
మరిన్ని వార్తలు