సర్పంచ్‌లకు షాక్‌

10 Sep, 2019 13:01 IST|Sakshi

సాక్షి, మెదక్‌ : గ్రామాల్లో రోజురోజుకు పేరుకుపోతున్న విద్యుత్‌ బకాయిలు ఇటు పంచాయతీరాజ్, అటు విద్యుత్‌శాఖకు పెద్ద సమస్యగా మరింది. పునర్విభజనలో ఏర్పాటైన మెదక్‌ జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించి పదిహేనేళ్లుగా మొత్తం విద్యుత్‌శాఖకు రూ.1.58 కోట్ల బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో పంచాయతీకి రూ.లక్షల్లో బకాయిలు ఉండటంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు బకాయిల కోసం ఏక్షణాన అయినా విద్యుత్‌ను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. 

ప్రభుత్వ ప్రకటనతోనే..
గ్రామ పంచాయతీల విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2010లో ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లులు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా వీధిదీపాలు, మంచినీటి పథకాలకు విద్యుత్‌వాడకం ఎక్కువగా ఉంటోంది. బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందనే ప్రకటనతో గ్రామ పంచాయతీల అధికారులు, ప్రజాప్రతినిధులు బిల్లుల చెల్లింపులను పట్టించుకోలేదు. అంతేకాకుండా విద్యుత్‌ వాడకంలో సైతం పొదుపు చర్యలు చేపట్టక పోవడంతో కొన్ని గ్రామాల్లో 24 గంటల పాటు విద్యుత్‌ధీపాలు వెలుగుతూనే ఉన్నాయి. 

తడిసి మోపెడవుతున్న బిల్లులు
పంచాయతీలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులు కుప్పులు తెప్పలుగా పేరుకుపోవటంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇక నుంచి పంచాయతీలే విద్యుత్‌ బిల్లులను చెల్లించుకోవాలని 2016లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్ర్‌రంలో ఇచ్చిన ఉత్తర్వుల నుంచి 2016 వరకు బిల్లులు చెల్లించక పోవటంతో బకాయిలు తడిసి మోపెడయ్యాయి. 2016 తర్వాత నుంచి ప్రభుత్వం పంచాయతీ నిధుల నుంచి బిల్లులు వసూలు చేయటం మొదలు పెట్టింది. సర్పంచ్‌లు దీన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించటంతో ప్రతిఏటా అభివృద్ధి కోసం పంచాయతీలకు విడుదలయ్యే నిధుల నుంచి 20 నుంచి 25 శాతం రాబట్టేలా కృషి చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారిచేసింది.

బకాయిలపై లేఖ రాశారు
గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలను చెల్లించాలని ఇటీవల సంబంధిత విదుత్‌శాఖ అధికారులు లేఖరాశారు. విద్యుత్‌ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాం. గతేడాది మంజూరైన పద్నాలుగవ ఫైనాన్స్‌కు సంబంధించి జిల్లాలో సుమారు రూ.40 లక్షల వరకు బిల్లులు చెల్లించాం. ఇంకా రూ.1.58 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నాం. ఇక నుంచి ప్రతి నెల కరెంట్‌ బిల్లులు సంబంధిత పంచాయతీలే ట్రాన్స్‌కోకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– కాశీనాథ్, విద్యుత్‌ ఎస్సీ, మెదక్‌  

మరిన్ని వార్తలు