ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే విజయం ఖాయం!

10 Nov, 2018 09:36 IST|Sakshi
బార్దీపూర్‌ గ్రామం

సాక్షి,బోధన్‌(నిజామాబాద్‌) : ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే ఎన్నికల్లో విజయం ఖాయమని రాజకీయ నేతల నమ్మకం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసే రాజకీయ పార్టీల నేతలు ఆ పల్లె నుంచే ప్రచారం ప్రారంభించే పొలిటికల్‌ సెంటీ మెంట్‌ 20 ఏళ్లుగా కొనసాగుతోంది. అదే బోధన్‌ మండలంలోని బర్దీపూర్‌ గ్రామం. మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈశన్య దిశలో ఉన్నా చిన్న పల్లెటూరు.. రాజకీయ నాయకులు ప్రచారం ఈ పల్లె నుంచే మొదలు పెడితే విజయం సిద్ధిస్తుందని జ్యోతిష్క్యుల సూచనలను నియోజక వర్గ అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఈ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆయలంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

తొలిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి 1999 ఎన్నికల్లో బర్దీపూర్‌ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికలతో పాటు తాజాగా 2018 ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు. అయితే 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఓడిపోయారు. ఈ విషయం తెలిసి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ గ్రామం నుంచే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. పొలిటికల్‌ సెంటిమెంట్‌తో బర్దీపూర్‌ గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ బర్దీపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకుని అబివృద్ధికి కృషి చేశారు.

మరిన్ని వార్తలు