తాత్కాలికం ఇంకెన్నాళ్లు..?

15 Nov, 2018 14:02 IST|Sakshi
రోడ్డు తెగిపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలు

వంతెన నిర్మాణమెప్పుడు..?

ప్రజాప్రతినిధుల హామీలు కాగితాలకే పరిమితం

సాక్షి, చెన్నూర్‌రూరల్‌: వాగులపై వంతెన లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగు ఉప్పొంగినప్పుడల్లా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులో నడుచుకుంటూ దాటుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా ..ఇప్పటికీ వాగుపై వంతెన ఏర్పాటు చేయలేదు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఈ పరిస్థితి మండలంలోని సుద్దాల, నారాయణపూర్, రాయిపేట  గ్రామాల్లో నెలకొంది.

ఈ గ్రామాలకు వెళ్లాలంటే మధ్యలో వాగులు ఉన్నాయి. కానీ వీటిపై ఎలాంటి వంతెన లేదు. దీంతో సుద్దాల వాగుకు అవతలి వైపు ఉన్న తుర్కపల్లి, కమ్మరిపల్లి, దుబ్బపల్లి, గంగారం గ్రామాల ప్రజలకు ప్రతీ ఏటా వర్షాకాంలో వాగు దాటడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నారాయణపూర్, రాయిపేట గ్రామాల ప్రజలు కూడా వాగుపై వంతెన లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అత్యవర పరిస్థితుల్లో వాగు దాటలేని దుస్థితి నెలకొంది. కనీసం 108 కూడా పరిస్థితి ఉంది. వర్షాకాలంలో రైతులు ఎరువులకు, విత్తనాలకు, ఇతర పనులకు తప్పనిసరిగా మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. ఆ సమయంలో వాగులు ఉప్పొంగితే కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. అలాగే చెన్నూర్‌లో కళాశాలల్లో చదువుకొనే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హామీలు నెరవేరేనా..?
సుద్దాల వాగుపై రోడ్డు డ్యాం నిర్మాణానికి నిధులను 2012లో మంజూరు చేస్తామన్నారు. కానీ ఇంత వరకు నిధులు కాలేదు. అలాగే ఇద్దరు మఖ్య నేతలు సుద్దాల వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని హామీలు ఇచ్చారు కానీ, ఇంత వరకు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

భక్తులకు తీవ్ర ఇబ్బంది
సుద్దాల గ్రామంలో ఎంతో ప్రాచనీ చరిత్ర ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతీ ఏటా శ్రీ రామనవమికి ఎంతో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కానీ వర్షాకాలంలో భక్తులు రాలేని దుస్ధితి నెలకొంది. వంతెన ఎప్పుడు నిర్మిస్తారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు