నాదస్వర మణులు

23 Feb, 2018 09:15 IST|Sakshi
వల్లభికి చెందిన సన్నాయి నారీమణుల బృందం

గానంలో వల్లభి గ్రామ మహిళల ప్రతిభ 

పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు, ప్రశంసలు

నాదస్వర కచేరీలో మహిళలు రాణించడం అరుదైన విషయం..అందులో  కుటుంబ సభ్యులంతా రాణిస్తే విశేషం. ఆ కీర్తి ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి దక్కింది. మహిళలంతా నాదస్వర కచేరీలు నిర్వహిస్తూ  ప్రశంసలు అందుకుంటున్నారు. 

ముదిగొండ:  ముదిగొండ మండలం వల్లభి గ్రామంలోని పలువురు మహిళలు ‘నాదస్వర’ ప్రతిభావంతులుగా పేరు గడిస్తున్నారు. షేక్‌ మీరాబీ, హుస్సేన్‌బీ, జి రాజేశ్వరీ, అనిఫా, పి లక్ష్మి, పి నాగలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రోగ్రాంలు ఇస్తున్నారు. వీరంతా గ్రామానికే చెందిన  షేక్‌ యాకూబ్‌సాహెబ్‌ వద్ద నాలుగేళ్లు సాధన చేశారు. తల్లిదండ్రుల కూడా ప్రోత్సహించారు. నాదస్వర నారీమణులు చదువుకున్నది కూడా తక్కువ అయినా, సాధనలో మిన్నగా ఉన్నారు. ఊపిరి బిగపట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించడం అంత తేలికకాదు.  ఇటువంటివి నేర్చుకునేందుకు మగవారు సైతం జంకుతారు. కానీ మహిళలు మాత్రం నిష్ణాతులై ప్రదర్శనలు ఇస్తున్నారు.

నేర్చుకున్న స్వరాలు
సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి, గీతాలు, కృతులు, వర్ణాలు, మొదలగు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, సృతి ప్రధానమైనవి. ప్రతి ఏటా వీరికి ఆరు నెలల పాటు సీజనల్‌ ప్రోగ్రామ్స్‌ చేస్తారు. మాఘమాసం, చైత్రం, వైశాఖమాసం, శ్రావణమాసం లలో వీరికి సీజన్‌. మిగతా ఆరు నెలలు జీవన భృతి కోసం కూలీ పనులకు వెళుతుంటారు. డోలు వాయిద్యకారుడు దరిపల్లి శేషయ్య కుమార్తెలు లక్ష్మి, నాగలక్ష్మి, నాగేశ్వరి ముగ్గురు నాదస్వరంలో ప్రావీణ్యం పొందారు. షేక్‌ మీరాబీ సిస్టర్స్‌ కూడా నాదస్వరంలో రాణిస్తున్నారు.  ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, తిరుపతి, సూర్యపేట, వేములవాడ రాజన్న దేవాలయాల్లో భక్తి గీతాలు ఆలపించడానికి సన్నాయి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు.

అవార్డులు..ప్రశంసలు..
ఖమ్మంలో జరిగిన తెలుగు మహాసభల్లో అప్పటి కలెక్టర్‌ సిద్దార్థ జైన్‌ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, షీల్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో కళాకారులకు నిర్వహించిన సిల్కాన్‌ ఆంధ్రా ప్రోగ్రాంలో అవార్డులు, ప్రశంస పత్రాలు పొందారు. గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లచే సన్మానం పొందారు.

అమ్మానాన్నల ప్రోత్సాహం..
చిన్ననాటి నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్నాం. నాన్న శేషయ్య డోలు వాయిద్యంలో మంచి ప్రావీణ్యుడు. మేం ముగ్గురం అక్కా చెల్లె్లళ్లం. అందరం కలిసి నాన్నతో పెళ్లిళ్లు, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు వెళుతుంటాం. అమ్మానాన్నల ప్రోత్సాహంతో సంగీతంలో రాణిస్తున్నాం.– లక్ష్మి, నాగలక్ష్మి సన్నాయి సిస్టర్స్‌

ఎంతో ఇష్టం
సన్నాయి, సంగీతంలో కళాకారులుగా రాణించడం ఎంతో ఇష్టం. ఇతర జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లకు, దేవాలయాల్లో ఆరాధనోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మాకు సంగీతం నేర్పిన గురువుకు వందనం, మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అందరి ప్రసంశలు అందుకుంటున్నాం,   –షేక్‌ మీరాబీ, సన్నాయి కళాకారిణి

మరిన్ని వార్తలు