అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం

10 Jul, 2019 11:22 IST|Sakshi
తాళ్లరాంపూర్‌లో ఆంగ్ల మాధ్యమానికి అనుమతి ఇవ్వాలని తీర్మానం చేసిన పత్రాన్ని అందిస్తున్న గ్రామస్తులు

అనుమతి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్న విద్యాశాఖ

గ్రామ పంచాయతీ, ఎస్‌ఎంసీ కమిటీల తీర్మానం ఉంటే ఓకే అంటున్న అధికారులు

గ్రామాల్లో పెరుగుతున్న ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు

మోర్తాడ్‌(బాల్కొండ): ప్రభుత్వ బడులను పరిరక్షించుకోవడానికి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు గ్రామ పంచాయతీ, ఎస్‌ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. దీంతో అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. 2019–2020 విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్న పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు అనేక పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చిన విద్యాశాఖ తాజాగా మరో తొమ్మిది పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చింది. జిల్లాలోని మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్, ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, ఆర్మూర్‌ మండలంలోని మంథని, కోమన్‌పల్లి, సుర్బిర్యాల్, డిచ్‌పల్లి మండలంలోని కొరట్‌పల్లి, కమలాపూర్, నవీపేట్‌ మండలంలోని నాళేశ్వర్, రెంజల్‌ మండలంలోని దూపల్లి పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆరు, ఏడు తరగతుల్లో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో అనుమతి ఇవ్వగా వచ్చే ఏడు ఎనిమిదో తరగతికి ఆంగ్ల మాధ్యమాన్ని విస్తృత పరచనున్నారు. దశల వారీగా పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది.

ఆంగ్ల మాధ్యమంపై ఉన్న మోజుతో ఎంతో మంది విద్యార్థులను వారి తల్లితండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలను మూసివేయడం లేదా రేషనలైజేషన్‌ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. అయితే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలంటే విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తేనే పాఠశాలల పరిరక్షణ జరుగుతుందనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు, ఎస్‌ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం అమలుకు మూడేళ్ల కిందనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను స్వీకరించారు.

అయితే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. చివరకు ఈ విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యాశాఖ అనుమతులను ఇస్తోంది. కాగా కొత్తగా ఉపాధ్యాయుల పోస్టులను కోరడం, అదనపు గదులు, ఇతర సౌకర్యాలను అడగకుండా షరతు విధించి ఆంగ్ల మాధ్యమం అమలునకు అనుమతిని విద్యాశాఖ అధికారులు ఇస్తున్నారు. అనేక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఈ ఏడు అనుమతులను ఇవ్వడంతో వచ్చే ఏడాది కొత్తగా అనుమతులను కోరే పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ప్రభుత్వ బడులను పరిరక్షించడానికి ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు అడిగిన వెంటనే అనుమతులు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.  

మరిన్ని వార్తలు