మూసివేయాల్సిందే!

20 May, 2014 00:09 IST|Sakshi

రాజేంద్రనగర్, న్యూస్‌లైన్: ఆయిల్ పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గగన్‌పహాడ్ వాసులు ఆయా పరిశ్రమల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఒక పరిశ్రమ యజమానిని గ్రామం లో నిర్బంధించారు. పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో అతడిని విడుదల చేశారు. గగన్‌పహాడ్ ప్రాంతంలో శీతల్‌డ్రాప్ ఆయిల్ మిల్, గోవర్ధన్, మానియర్, పవన్, గోల్డ్‌డ్రాప్ ఆయిల్ మిల్స్ కొనసాగుతున్నాయి. పరిశ్రమ నిర్వహణలో ఇక్కడ వరి పొట్టును వినియోగిస్తున్నారు. పొట్టుకాలి పొగ గ్రామంలోకి వ్యాపిస్తోంది. ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో పాటు ఇళ్లన్నీ పొగతో మసిబారుతున్నాయి. వాయు కాలుష్యానికి కారణమవుతున్న ఈ ఆయిల్ మిల్స్‌ను మూసివేయాలని స్థానికులు గతంలో పలుమార్లు ఆందోళన నిర్వహించారు.

 ఈ నేపథ్యంలో గగన్‌పహాడ్ గ్రామానికి చెందిన యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో సోమవారం ఉదయం శీతల్ డ్రాప్ ఆయిల్‌మిల్ వద్దకు చేరుకున్నారు. యజమాని ఉమేష్‌ను గ్రామానికి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో  నిర్బంధించారు. ఆ తర్వాత గోవర్ధన్ ఆయిల్‌మిల్, గోల్డ్‌డ్రాప్ పరిశ్రమల వద్దకు వెళ్లి.. వాటి యజమానులను నిర్బంధిం చారు. అయితే, వారు తప్పించుకొని వెళ్లిపోయారు. గ్రామస్తుల ఆం దోళనపై సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

 ఉమేష్ ను విడుదల చేయాలని ఆందోళనకారులను కోరారు. ఆరోగ్యాన్ని హరిస్తున్న పరిశ్రమలను మూసి వేసే వరకు ఆందోళన విరమించే ది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. దీంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గ్రామస్తులను సముదాయించారు.  వారం రోజుల్లో పరిశ్రమను మూసివేస్తానని శీతల్‌డ్రాప్ యజమాని ఉమేష్ రాత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు