వెలివేతపై చర్యలకు డిమాండ్‌

28 Jul, 2018 09:44 IST|Sakshi
విలేకరుల సమావేశంలో నాయీ బ్రాహ్మణ నాయకులు (ఫైల్‌)

సాక్షి, ఆసిఫాబాద్‌: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో నాయీ బ్రాహ్మణులు, రజకులపై గ్రామ బహిష్కరణ విధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక​ డిమాండ్‌ చేసింది. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఊరు నుంచి వెలివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ మద్దికుంట లింగం నాయీ తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన గ్రామ పెద్దలపై చట్టపరంగా తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన నాయీ బ్రాహ్మణులు, రజకులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. తమ వారికి న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

ఆందోళనలకు సిద్ధం: రజకులు
రజకులకు న్యాయం జరగని పక్షంలో తాము కూడా రాష్ట్ర ఆందోళనలు చేపడతామని చాకలి ఎస్సీ సాధన సమితి ప్రకటించింది. తమ సంఘీయులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. సాంఘిక దురాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు.

వాస్తవం లేదు: గ్రామస్తులు
కొండపల్లిలో రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులను గ్రామం నుంచి బ​హిష్కంచలేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని సీఐ రమణమూర్తి, తహశీల్దార్‌ సాయన్నకు ఈ మేరకు తెలిపారు. గ్రామంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు గ్రామం నుంచి ఎలాంటి సహకారం అందించవద్దని తీర్మానించామే తప్ప గ్రామం నుంచి బహిష్కరించలేదని వారు చెప్పడం గమనార్హం. ఎటువంటి సహాయం అందించవద్దని చెప్పడం వెలివేత కాకపోతే ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు