మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

25 Mar, 2020 03:04 IST|Sakshi
రాళ్లుపెట్టి వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

సంగారెడ్డి జిల్లాలో ఘటన 

నారాయణఖేడ్‌: హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దంటూ మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలంలోని సత్తెగామ ప్రజలు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెగామకు చెందిన కుమ్మరి కిష్టయ్య (52) కుటుంబంతో కలసి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఆయన అనారోగ్యానికి గురవడంతో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం మరణించాడు. దీంతో బంధువులు కిష్టయ్య మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తెగామకు తీసుకు వచ్చి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు.

గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్సలు చేస్తున్నందున అక్కడి నుంచి కిష్టయ్య మృతదేహాన్ని తీసుకువస్తే తమకు ప్రమాదమని, మృతదేహాన్ని తీసుకురావద్దంటూ గ్రామస్తులు ఊరి శివారులోని పాఠశాల వద్ద వాహనానికి అడ్డుగా రాళ్లువేసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  మృతదేహాన్ని నేరుగా తీసుకెళ్లి వారి వ్యవసాయ భూమి వద్ద అంత్యక్రియలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. 

మా ఊరికి రావొద్దు..!
రేగోడ్‌ (మెదక్‌): కరోనా వైరస్‌ మహమ్మారి ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడ.. ఎలా.. ఎవరి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఏకంగా అరవైమంది కొత్త వ్యక్తులు రావడంతో.. ఆ ఊరివారు తమ గ్రామానికి రావొద్దని.. అపరిచిత వ్యక్తులను అడ్డుకున్నారు. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలంలోని ఆర్‌.ఇటిక్యాలలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు అరవై మంది నాలుగు వాహనాల్లో ఆర్‌.ఇటిక్యాలకు వచ్చారు. దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు.

వారంతా ఇటీవల సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వారి సొంతూళ్లకు వెళ్లాలని వట్‌పల్లిలో ప్రజలు పంపిస్తే వారంతా ఆర్‌.ఇటిక్యాలకు చేరుకున్నారు. గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో వారిని ఊర్లో ఉండకూడదని, వారి స్వస్థలాలకు వెళ్లాలంటూ పంపించామని సర్పంచ్‌ సుంకె రమేశ్‌ తెలిపారు. తహసీల్దార్‌ సత్యనారాయణ వారితో మాట్లాడి కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు