గొంతెండుతోంది..

5 May, 2014 00:13 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండే ఎండల్లో ప్రజలకు గుక్కెడు నీరు దొరకడం లేదు. పల్లెల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వేసవి తాపంతో విలవిల్లాడుతున్న గ్రామాల దాహార్తిని తీర్చే నాథుడే కరువయ్యాడు.పట్టణాలు, గ్రామాలు, గిరిజన తండాలు ఇలా ఒకటేమిటి.. జిల్లాలో ఎక్కడ చూసినా నీటి ఎద్దడితో ప్రజలు విలవిలలాడుతున్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. మంచినీటి బావులు ఎండిపోయాయి. 600 అడుగులకు పైగా లోతు వేస్తే గానీ బోర్లలో నీరు రాని పరిస్థితి.

జిల్లాలో మూడింట రెండొంతులకు పైగా చేతి పంపులు ఎండిపోయాయి. మిగిలిన వాటిలో సగం చెడిపోయి మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని బాగు చేసే నాథుడే లేడు. ఇక ఉన్నవాటిలో కూడా నీరు అంతంతమాత్రంగానే వస్తోంది. ఏటా వేసవి కాలం ముందు గ్రామీణ నీటి సరఫరా అధికారులు  నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌ను ఈ ఏడాది పట్టించుకోలేదు. జిల్లాలో సగానికి పైగా గ్రామీణ మంచినీటి పథకాలు పనిచేయడం లేదు.  నిర్మాణంలో ఉన్న ట్యాంకులను పూర్తి చేసి అందుబాటులోకి తేలేదు. కరెంటు కోతలు నీటి ఎద్దడి సమస్యకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

కరెంటు సరఫరా లేని కారణంగా బోర్లు  నడవడం లేదు. ఊర్లోని బోర్లు అడుగంటడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న గ్రామీణ వాసులను అక్కడా కరెంటు కోతలు వెక్కిరిస్తున్నాయి. త్రీ ఫేజ్ కంరెంటు వస్తే గానీ వ్యవసాయ బోర్లలో నీరు లభించదు. దీంతో పనీపాటా మాని కరెంటు ఎప్పుడొస్తుందోనని పొలాల్లో పడిగాపులు కాయాల్సిన దుర్భర స్థితి.  కిలోమీటర్ల మేర నడిచి పోయి చెలమలు, వాగుల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామాల్లో సైతం ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు రాజ్యమేలుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నీటి వ్యాపారులు అధిక ధరలకు నీరు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో మంచినీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెడిపోయిన చేతిపంపులు, ట్యాంకర్లను మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు