‘మున్సిపాల్టీల్లో అన్యాయంగా గ్రామాల విలీనం ’

25 Oct, 2018 01:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగంలోని 243(క్యూ) అధికరణానికి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ (4/2018)ను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై బుధ వారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన పలువురు తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టసవరణను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. చట్ట వ్యతిరేకంగా గ్రామాల్ని మున్సిపాల్టీ లు, మున్సిపల్‌ కార్పొరేషన్లల్లో విలీనం చేస్తున్నారని, మధ్యలో కొన్ని గ్రామాల్ని వదిలిపెట్టి ఎంపిక చేసుకున్న గ్రామాల్నే విలీనం చేయడాన్ని హైకోర్టు గమనించాలన్నారు. రాజ్యాంగంలోని 243(క్యూ) అధికరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని చెప్పారు. పిటిషనర్ల వాదనలు ముగియడంతో ప్రభుత్వ వాదన నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు