నీళ్లిస్తారా.. చావమంటారా?

16 Mar, 2016 02:47 IST|Sakshi

`మహబూబ్‌నగర్ న్యూటౌన్: తమ గ్రామాల్లో నెలకొన్న నీటిఎద్దడిని నివారించి.. గుక్కెడు తాగునీళ్లు ఇవ్వాలని కోయిల్‌సాగర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంగళవారం కలెక్టరేట్‌లో పురుగు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కలెక్టర్ వచ్చేవరకు ఇక్కడే ఉంటామని.. రాకపోతే ఇక్కడే తాగి చస్తామని హెచ్చరించారు. పోలీసులు, ఆందోళనకారుల మద్య కొంతసేపు తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతటితో ఆగకుండా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉందని తెలుసుకున్న రైతులు, ప్రజలు కలెక్టర్ బంగ్లావద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీసీకుంట, దేవరకద్ర, ధన్వాడ మండలాల పరిధిలోని 64 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

కోయిల్‌సాగర్‌లో ప్రస్తుతం 12ఫీట్ల నీరు నిల్వ ఉందని, అందులో రెండుఫీట్ల నీరు కాల్వల ద్వారా వదలాలని డిమాండ్ చేశారు. ఈ నీటితో బోర్లు రీచార్జి కావడమే కాకుండా పశువులకు, ఆయా గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. గతంలో అధికారులకు చెప్పినా  పట్టించుకోలేదన్నారు. రెండురోజులుగా తాగునీరు ఇవ్వాలని కలెక్టరేట్‌లో నిరీక్షిస్తుంటే కలెక్టర్ తమ సమస్యను పట్టించుకోకుండా కార్యాలయం వైపు చూడటంలేదని ఆరోపించారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని చెబుతున్నారని, మరి పశువులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు.

వేల కొద్ది గొర్రెలున్నాయని, తాగునీరు లేక ఇప్పటికే చాలా గొర్రెలు చనిపోయాయని పేర్కొన్నారు. కోయిల్‌సాగర్ నుంచి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయకపోతే అక్కడినుంచి మహబూబ్‌నగర్ పట్టణానికి తాగునీటిని ఆపేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బుధవారం ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలతో సమావేశం నిర్వహించి తాగునీరు అందించే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు