పల్లె రోడ్లకు మరమ్మతులు!

7 Feb, 2019 10:30 IST|Sakshi

ఐదేళ్ల క్రితం గ్రామాల్లో నిర్మించిన పంచాయతీరాజ్‌ బీటీ రోడ్లు చాలా వరకు ధ్వంసమై గుంతల మయంగా మారాయి. వీటి మరమ్మతులకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పనుల అంచనాలను  రూపొందించారు. 
కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
పంపించారు. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇటీవలే అన్ని పంచాయతీలకు పాలక వర్గాలు కొలువు దీరాయి.. ఈ తరుణంలో పల్లె ప్రగతికి బాటలు వేసే గ్రామాల్లోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌ (పీఆర్‌) రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన చాలా వరకు పీఆర్‌ రోడ్లు గుంతల మయంగా మారాయి. వీటిపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. కొన్ని రోడ్లైతే అడుగుకోగుంత ఏర్పడటంతో గంట సేపు ప్రయాణిస్తే నడుం నొప్పి వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పీఆర్‌ రోడ్ల మరమ్మతులకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది.  జిల్లాలో ఐదేళ్లు, అంతకు ముందు నిర్మించిన రోడ్లన్నింటికీ బీటీ రెన్యూవల్స్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు తయారుచేసింది.

42 రోడ్లకు రూ.21 కోట్లు.. 
జిల్లాలో ఉన్న పంచాయతీరాజ్‌ రోడ్లలో ఐదేళ్లు, అంతకు ముందు నిర్మించి మరమ్మతులకు నోచుకోని 42 రోడ్లకు ఈసారి బీటీ రెన్యూవల్‌ చేయాలని ఆ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం నిర్ణయించింది. రూ.21 కోట్లతో ఈ పనుల అంచనాలను అధికారులు రూపొందించారు. ఈ మేరకు నిధుల మంజూరు కోసం జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

తారు రోడ్డు లేని పంచాయతీలు.. 
జిల్లాలో అనేక తండాలు, నివాసిత ప్రాంతాలు ఇప్పుడు పూర్తిస్థాయిలో నూతన పంచాయతీలుగా మారాయి. ఇలా ఏర్పడిన అన్ని గ్రామ పంచాయతీలకు తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా తారు రోడ్డు లేని గ్రామ పంచాయతీల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర జిల్లాలతో పోల్చితే తారు రోడ్డు లేని గ్రామ పంచాయతీలు జిల్లాలో అతితక్కువ. జిల్లా వ్యాప్తంగా కేవలం మూడు కొత్త పంచాయతీలకు మాత్రమే తారు రోడ్డు లేదని అధికారులు గుర్తించారు. ధర్పల్లి మండలం మోబిన్‌సాబ్‌ తండా, నడిమిబల్‌ రాంతండా, వర్ని మండలం చిలుక తండాకు మాత్రమే బీటీ రోడ్లు లేవు. వీటికి కూడా బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు.

బ్లాక్‌ స్పాట్‌ల వద్ద.. 
మెండోరా వద్ద 2018 మార్చి 25న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 19 మందితో ప్రయాణిస్తున్న ఆటో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా 11 మంది మృతి చెందారు. జిల్లా చరిత్రలోనే ఇంత భారీ రోడ్డు ప్రమాదం జరగలేదు. ఇలా 46 రోడ్లలో 75 బావులు ప్రమాదకరంగా పొంచి ఉన్నాయి. ఈ బావుల వద్ద రక్షణ గోడలు నిర్మించాలని, పాడుబడిన బావులైతే పూడ్చి వేయాలని గతంలోనే నిర్ణయించారు. అయితే ఈ పనులకు మోక్షం లభించలేదు. తాజాగా ఇలాంటి బ్లాక్‌స్పాట్‌ల వద్ద రక్షణగోడల నిర్మాణానికి రూ.3.50 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. 

ప్రతిపాదనలు పంపాము 
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పీఆర్‌ రోడ్ల మరమ్మతు పనులకు సంబంధించిన అంచనాలు ఇటీవల రూపొందించాము. అలాగే బీటీ రోడ్లు లేని గ్రామ పంచాయతీల గుర్తింపు ప్రక్రియను కూడా  పూర్తి చేశాము. మూడు పంచాయతీలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాము. అలాగే రోడ్లపై ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాము. నీలకంఠేశ్వర్,ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ 

మరిన్ని వార్తలు