పల్లె గప్‌చుప్‌

23 Mar, 2020 03:01 IST|Sakshi
నిర్మానుష్యంగా మారిన కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు

జనతా కర్ఫ్యూకు గ్రామాల మద్దతు

ఇళ్ల నుంచి బయటకు రాని జనం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ కు తెలంగాణ పల్లెవాసులు సంపూర్ణ మద్దతు పలికారు. గ్రామీణ ప్రజానీకం దృఢ సంకల్పంతో కర్ఫ్యూలో పాల్గొని ఐక్యతను చాటింది. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తం గా అన్ని గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించారు. గ్రామాల్లో చిన్న దుకాణాలు, బడ్డీకొట్లు మొదలు అన్నీ మూతబడ్డాయి. రైతులు సైతం సాగు పనులు నిలిపివేసి ఇంటిపట్టునే ఉన్నారు. అన్ని వర్గాలు జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. 

ముందస్తు ప్రణాళికతో... 
జనతా కర్ఫ్యూపై గ్రామ పంచాయతీలు ముందస్తు చర్యలు చేపట్టాయి. గ్రామ సచివాలయం ఆధ్యర్యంలో రెండ్రోజుల ముందు నుంచే కర్ఫ్యూపై దండోరా వేయించారు. సామాజిక మాధ్యమాలు, మీడియాలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు సైతం ముందస్తుగా సూచనలు చేశారు. దేశభక్తి, ఐక్యతపై సోషల్‌ మీడియాలో పలు రకాల వీడియోలు, చిత్రాలు వైరల్‌ కావడంతో కర్ఫ్యూపై లోతుగా ప్రచారం జరిగింది. దీంతో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ముందస్తుగా సిద్ధమయ్యారు. ఇంటికి కావాల్సిన సరుకులను ముందురోజే సమకూర్చుకున్నారు.

ముందు రోజు చేసే కార్యక్రమాలను వీలైనంత మేర ముందస్తుగా ముగించుకోవడం, లేదా తర్వాతి రోజుకు వాయిదా వేసుకోవడం లాంటివి చేసుకున్నారు. సాధారణంగా గ్రామాల్లో సెలవు వాతావరణం ఉంటే ఇంటి బయట అరుగులపైనో, రోడ్డు పక్కన ముచ్చట్లు పెట్టుకోవడం కనిపించేది. కర్ఫ్యూతో అలాంటివేవీ కనిపించలేదు. మెజార్టీ ప్రజలు తలుపుదాటి బయటకు రాలేదు. కొన్నిచోట్ల అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అరగంట, గంటకోసారి పోలీసు వాహ నాలు సైరన్‌తో వెళ్లడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. దీంతో మెజార్టీ ప్రాంతా ల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు.   

మరిన్ని వార్తలు