‘బోరు’న మంజీర!

29 Feb, 2016 02:07 IST|Sakshi
‘బోరు’న మంజీర!

మంజీరమ్మ.. మరింత గోసకు గురిచే స్తోంది. ఎన్నడూ ఇంతటి దుస్థితికి గురిచేయని నదీమ తల్లి నేడు అగ్ని పరీక్ష పెడుతోంది. ఇప్పటికే నది పూర్తిగా ఎండిపోగా అందులో వేసిన బోర్లూ వట్టిపోతున్నాయి. మంచినీటి పథకాలకు నీరు అందడం గగనంగా మారింది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే నడి వేసవిని తలుచుకుని జనాలు తల్లడిల్లుతున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు మంజీర నదిపై ఆధారపడ్డారు. ఈ నియోజకవర్గాలకు నీటి పథకాలు నదిపై ఏర్పాటు చేశారు. నది ఎండిపోవడంతో అధికారులు పలుచోట్ల బోరుబావులను తవ్వించి మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. బోరుబావులు సైతం వట్టిపోతుండటంతో నీటి గోస అంతా ఇంతా కాదు..
 
నారాయణఖేడ్: మనూరు మండలం గౌడ్‌గాం జన్‌వాడ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న మంజీర నది జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్లమేర ప్రవహిస్తుంది. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల పథకాలు, ఇన్‌టెక్‌వెల్‌లు సైతం ఈ నియోజకవర్గం సమీపంలోనే నిర్మించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాలకు మంజీర నీటిని సరఫరా చేసేందుకు పలు పథకాలు నదిపై నిర్మించారు. నాబార్డు ఆర్థిక సహాయంతో 13 ఏళ్ళ క్రితం రూ.14కోట్ల వ్యయంతో గూడూరు వద్ద 74 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని నిర్మించారు.

ఎన్‌ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేస్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గానికి ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. మంజీర నది ఎండిపోవడంతో పథకాల ద్వారా నీటిని సరఫరా చేయడం ఇబ్బందికరంగా పరిణమించింది. నవంబర్ మాసంలో ఇన్‌టెక్‌వెల్ వరకు కాల్వలు తీయడం, పైపులు వేసి తదితర ఏర్పాట్లతో నీటిని పంపింగ్ చేశారు. అనంతరం అవీ ఎండిపోయాయి.  
 
నదిలో బోర్లూ ఎండిపోయాయి...
మంచినీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లకు నీరు అందని పరిస్థితి ఉండండంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నదిలో బావుల తవ్వకం, బోర్లను ఢ్రిల్లింగ్ చేశారు. డిసెంబర్ మాసంలో శాపూర్ ఇన్‌టెక్‌వెల్ సమీపంలో 6 బోర్లను అధికారులు ఢ్రిల్లింగ్ చేశారు. ఇందులో రెండు బోర్లు ఫేయిల్ అవగా, నాలుగు బోర్లలో నీరుపడింది. గుడూరు ఇన్‌టెక్‌వెల్ సమీపంలో 6 బోర్లను తవ్వగా నాలుగు బోర్లలో నీరు పడగా రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి.

ఇదే పథకం వద్ద పెద్ద బావిని అధికారులు తవ్వించారు. 9 ఫీట్ల లోతు, 30 మీటర్ల వెడుల్పుతో బావిని తవ్వారు. కాగా ప్రస్తుం నడుస్తున్న 8 బోర్లలో నాలుగు బోర్లు నీరు తగ్గిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. ఇవీ నడవని పరిస్థితి నెలకొంది. అంటే శాపూర్‌లో రెండు, గూడూర్‌లో రెండు బోర్ల చొప్పునే నడుస్తున్నాయి. ఇవీ ముందు ముందు ఏం చేస్తాయోనన్న భయంలో అధికారులు ఆందోళనతో ఉన్నారు. నదిలో తవ్విని బావుల్లోనూ నీటి జాడలు కరువయ్యాయి. శాపూర్ వద్ద తవ్విని బావిమధ్యలో భారీ బండ రావడంతో అధికారులు మధ్యలోనే వదిలేశారు.

నదిలోని ఫలింగా గూడూర్, ఎన్‌ఏపీ, బోరంచ పథకాల ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందించడం కష్టతరంగా మారింది. ఈ దుస్థితిని పరిశీలించిన అధికారులు నల్లవాగు ప్రాజెక్టు నీటిని పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేయాలన్న ఆలోచనచేస్తూ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. నదిలో బోర్లు ఫెయిల్ కావడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.

మరిన్ని వార్తలు