కొలువుదీరనున్న గణపయ్య

13 Sep, 2018 07:56 IST|Sakshi
వినాయక విగ్రహాలను తరలిస్తూ

ఎదులాపురం (ఆదిలాబాద్‌): గణేశ్‌ నవరాత్రులకు జిల్లా ముస్తాబైంది. గురువారం వినాయక చవితిని పురస్కరించుకోని  జిల్లావ్యాప్తంగా గణనాథులు కొలువుదీరనున్నారు. జిల్లాలో మొత్తం 826 వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గణేశ్‌ మండలి కమిటీల ఆధ్వర్యంలో మండపాలను సిద్ధం చేశారు. మండపాల అలంకరించి, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో చేపట్టిన నిర్మాణాలతో మండపాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచే భారీ విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో మండపాలకు తరలించారు. గురువారం చవితి పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది.

పలువురు ఒక రోజు ముందుగానే వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ కనిపించారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం పెరిగిన నేపథ్యంలో చాలా మంది మట్టి గణపతులను ప్రతిష్టించేందుకు ఉత్సాహం చూపించడం విశేషం. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో జై శ్రీరాం గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో వినాయక చౌక్‌ సమీపంలో 51 అడుగుల వినాయక ప్రతిమను, కుమార్‌ జనతా మండల ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహంతో పాటు 25 ఫీట్ల శ్రీకృష్ణ విశ్వరూప ప్రతిమను (గీతాబోధన చేస్తున్నట్లుండే) ఏర్పాటు చేశారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కిసాన్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో కర్ర గణపతిని ప్రతిష్టిస్తున్నారు. పట్టణంలోని పలు మండళ్లలో వినూత్నంగా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.

భారీ బందోబస్తు..
జిల్లావ్యాప్తంగా 826 గణనాథులు కొలువుదీ రుతుండగా, జిల్లా కేంద్రం పరిధిలో 453 మండపాలు ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో మండపానికి ఒకరిని నియమిస్తూ, ప్రతి 10 గణేశ్‌ మండళ్లను ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. క్లస్టర్‌కు ఒక హెడ్‌ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును నియమించి రౌండ్‌ ది క్లాక్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 58 ప్రధాన మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో 32, ఇచ్చోడలో 9, ఉట్నూర్‌లో 17 మండపాల వద్ద ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్ని గణేశ్‌ మండళ్ల సభ్యులతో సమావేశాలు నిర్వహించి, వారి వివరాలను సేకరించారు. ఒక్కో గణేశ్‌ మండలిలో ఇద్దరు వ్యక్తులు (కార్య నిర్వాహకులకు) రౌండ్‌ ది క్లాక్‌ అందుబాటులో ఉండి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చూసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు