ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌  

17 Aug, 2019 03:20 IST|Sakshi
వినోద్‌కుమార్‌కు నియామక ఉత్తర్వులను అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

కేబినెట్‌ హోదాతో మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్న మాజీ ఎంపీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. నియామక ఉత్తర్వులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌ లో ఆయనకు అందజేశారు. కేబినెట్‌ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మూడేళ్ల పాటు వినోద్‌ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా సీఎం వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్‌ను ఉపాధ్యక్ష పదవికి సీఎం ఎంపిక చేశారు. సెపె్టంబర్‌ చివరివారంలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటంతో అన్ని శాఖల వ్యవహారాలను సమీక్షించడంతోపాటు ప్రతిపాదనలు తయారు చేసే కీలక బాధ్యతనూ వినోద్‌కుమార్‌కు కేసీఆర్‌ అప్పగించారు. ఈయన కేబినెట్‌ భేటీలకు శాశ్వత ఆహా్వనితుడిగా ఉంటారు. రాజకీయ, పాలనా అంశాల్లో ఉన్న అనుభవంతోపాటు రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్‌ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం ఈ పదవిలో నియమించారు. 

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి... 
కరీంనగర్‌ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్‌ బాల్యం, విద్యాభ్యాసం అంతా వరంగల్‌లో కొనసాగింది. వామపక్ష విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 2001లో టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడిగా చేరారు. అనంతరం పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరించిన ఆయన 2004లో హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. తిరిగి 2014లో కరీంనగర్‌ లోక్‌సభ నుంచి ఎన్నికైన ఆయన లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఉపనేతగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

నేరుగా సేవ చేసే అవకాశం 
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభించిందని వినోద్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన ఉపాధ్యక్షుడి హోదాలో రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ సమస్యలు, రాష్ట్ర వనరుల పట్ల ఉన్న అవగాహన నూతన బాధ్యతలు నిర్వర్తించడంలో తోడ్పడుతుందన్నారు. తనను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా నియమించిన సీఎం కేసీఆర్‌కు వినోద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు