రైళ్ల భద్రతకు యూరోపియన్‌ పరిజ్ఞానం

25 Nov, 2019 01:54 IST|Sakshi

రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్, తార్నాక: రైళ్లు ఢీకొనకుండా యూరప్‌ దేశాల్లో అమలులో ఉన్న సాంకేతిక వ్యవస్థను భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. యూరోపియన్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌ సిస్టం (యూటీసీఎస్‌)గా పిలుచుకునే ఈ సాంకేతికతను త్వరలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్టు తెలిపారు. స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో త్వరలో 650 కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి పనితీరు పరిశీలిస్తామని వెల్లడించారు.  ఆదివారం జరిగిన ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ (ఇరిసెట్‌) 62వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన రైళ్ల భద్రతపై కీలక వివరాలు వెల్లడించారు.  రైల్వే ఉద్యోగులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ఇరిసెట్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మాట్లాడుతూ, సరైన ఫలితాలు సాధించాలంటే మంచి సాంకేతిక పరిజ్ఞానం, మంచి నైపుణ్యం అవసరమని, వాటిని సొంతం చేసుకునేందుకు ఇక్కడి శిక్షణార్థులు మెరుగ్గా రాణించాలని సూచించారు. దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా కూడా మాట్లాడారు. జ్ఞానదీప్‌ పేరుతో ఇరిసెట్‌ రూపొందించిన పత్రికను వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు.

ఐఆర్‌ఐఎఫ్‌ఎం ప్రారంభం 
రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఆధ్వర్యంలో రూ.85 కోట్ల వ్యయంతో మౌలాలిలో నిర్మించిన ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం) నూతన క్యాంపస్‌ను వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. రైల్వేలోని ఆర్థికపరమైన అంశాలను చూసే విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు