సదా మీ సేవలోనే..

5 Jan, 2015 03:42 IST|Sakshi
సదా మీ సేవలోనే..

పువ్వాడ అజయ్‌కుమార్,
 ఖమ్మం ఎమ్మెల్యే
 అజయ్‌కుమార్ : అమ్మా బాగున్నారా? ఏం సాహెబ్‌గారు..మీ కాలనీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా..ఏమైనా ఉంటే చెప్పండి?
 అల్లం నర్సమ్మ : ఏమి బాగు బిడ్డా.. ముసలోళ్లం బతులు ఇలా అయ్యాయి. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పింఛన్ ఇచ్చేటోడు..నెలకు 200 వస్తే మందులు కొనుక్కునే దాన్ని.. గిప్పుడు గా పింఛన్ కూడా వస్తలేదు. ముసలోళ్లమైన మాకే పింఛన్ రాకుంటే ఎవరికిస్తరు బిడ్డా..జర నువ్వైనా ఇప్పించరాదే.
 
 అజయ్‌కుమార్ : ఏమి అవ్వా..నీ బాధేంటి?
 తిరుపతమ్మ : ఏం చేయాలి బిడ్డా..రోజంతా పనిచేసుకొని బతుకేటోళ్లం. మాకు ఉండటానికి
 ఇళ్లు లేవు. ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టిస్తమంటుంది. మా బతుకులకేసి చూసినోళ్లు లేరు. మీరైనా ఇంటిస్థలం ఇప్పించడయ్యా.
 అజయ్‌కుమార్ : బుచ్చమ్మా బాగున్నావా..? నీకు పింఛన్ వస్తుందా?
 బుచ్చమ్మ : లేదు దొరగారు.. మాకు పింఛన్ ఇవ్వట్లేదు. గిదిగో..నా ఆధార్‌కార్డు చూడండి..68 ఏళ్లు ఉన్నయ్..నాకు పింఛన్ ఇస్తలేరు. మీరు ధర్నా చేసిన కాడికి కూడా వచ్చిన. కాగితం ఇచ్చిన..జర పింఛన్ వచ్చేలా చూడండయ్యా.
 అజయ్‌కుమార్ : సలాం మాలేకోం..మీ బాధలు చెప్పండమ్మా..
 మదార్‌బీ : వాలేకుం సలాం..గీ పార్శీబంధంలో 20 ఏళ్లుగా ఉంటున్నం. ఇరుకుదారులు, రోడ్లులేవు, వర్షాకాలంలో మోకాళ్లలోతు బురద, పొయినేడు రోడ్లు పోస్తమని కంకర పోసిండ్రు. రెండురోజుల తర్వాత దాన్ని తీసుకుపోయిం డ్రు..ఇప్పటి వరకు రోడ్లు వేస్తమని చెప్పినోళ్లు లేరు.
 అజయ్‌కుమార్ : అమ్మా..మున్సిపాలిటీ వాళ్లు వస్తున్నారా?
 రహీంబీ : ఎక్కడ మున్సిపాలిటోళ్లు సారు..ఇటువైపు వచ్చినోళ్లే లేరు. నెలల తరబడి కాల్వలు సాపు చేయరు. మురుగునీరు వాసన వస్తోంది..దోమలు విపరీతంగా ఉన్నాయి. పట్టించుకున్నోళ్లు లేరు.
 అజయ్‌కుమార్  : అంగన్‌వాడీ కేంద్రం ఎలా ఉండమ్మా? వన్‌ఫుల్ మీల్స్ పెడుతున్నారా?
 కృష్ణకుమారి (అంగన్‌వాడీ టీచర్): ఇక్కడున్న వాళ్లంతా పనిచేసుకునే వాళ్లే సార్. 40 మంది పిల్లలు రోజూ వస్తారు. సొంతభవనం లేక ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ఇచ్చే కిరాయి చిన్నగదులకు మాత్రమే వస్తోంది. జనవరి 1 నుంచి గర్భిణులు, బాలింతలకు వన్‌ఫుల్ మీల్స్ పెడుతున్నాం సార్.
 అజయ్‌కుమార్ : ఏంటమ్మా..? బస్తాలు కట్టుకొని ఉంటున్నారు.. ? ఇల్లు లేదా.?
 సరిత : పేదోళ్లం సారు.. ఏం చేస్తాం.. పది సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని ప్రభుత్వ స్థలం కాల్వపై కట్టినమని కూటగొట్టిండ్రు. వేరేచోట ఇస్తమన్నరు..ఇంతవరకు జాడలేరు. ఏం చేస్తాం మా కర్మ. కిరాయి ఇంట్లో ఉండే స్తోమతలేక ఇదిగో ఇలా బస్తలు కట్టుకొని ఉంటున్నాం.
 అజయ్‌కుమార్ : ఏం తమ్ముడు.. ఏం చదువుతున్నావ్?
 వంశీ కృష్ణ : బీటెక్ ఫస్టియర్ చదువుతున్నా సార్..ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని బీటెక్‌లో చేరా. గత సంవత్సరం డబ్బులే ఇప్పటికీ రాలేదట! రీయింబర్స్ రాకపోతే చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందని భయంగా ఉంది సార్.
 అజయ్‌కుమార్ : మీరేరా ఈ స్కూల్ టీచర్? పిల్లలు స్కూల్‌కు బాగా వస్తున్నారా? భోజన పథకం మంచిగా అమలవుతోందా?
 రవికుమార్ : నేనే సార్. పిల్లలు బాగానే వస్తున్నార్సార్. మధ్యాహ్నభోజనం కూడా బాగానే వండిపెడుతున్నాం సార్. అంతాబాగానే ఉంది సార్. కానీ బడి చుట్టూ కాంపౌండ్‌వాల్ లేదు సార్. మంజూరయ్యేలా చూడండి.
 అజయ్‌కుమార్ : ఏం అమ్మా..ఏంటి నీ సమస్య?
 వంగాల లలిత : నాభర్త చనిపోయి ఐదేళ్లయిందయ్యా. ఇద్దరు పిల్లలు. ఆయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చినా..ఆధారాలన్నీ సమర్పించినా నాకు పింఛన్ ఇవ్వట్లేదయ్యా.
 అజయ్‌కుమార్ : ఏంటమ్మా ఆ కాగితం.. ఎందుకు తెచ్చావు..?
 వాణి : మాకు ఇందిరమ్మ రెండో విడతలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని అధికారులు చెప్పారు. ఇదిగో సార్.. ఇంటిపట్టా కూడా ఇచ్చారు. ఆరేళ్లయినా స్థలం చూపించలేదు. ఇస్తరో..ఇవ్వరో కూడా చెప్పట్లేదు సార్.
 అజయ్‌కుమార్ : ఏం పెద్దాయనా..బాగున్నావా?
 హుస్సేన్ : ఏం బాగండి.. మా ముసలి దాని కాళ్లు పడిపోయినై..నెలనెలా వచ్చే పింఛన్ ఐదునెలల నుంచి రావట్లేదు. మీరైనా పింఛన్ ఇప్పించండయ్యా.
 అజయ్‌కుమార్ : ఏం అన్నపూర్ణమ్మ బాగున్నారా? మీ సమస్యలేమిటి?
 అన్నపూర్ణమ్మ : బాగున్నాం సార్..మంచినీరు రావట్లేదు. గీ పంపే అందరికీ దిక్కు. దీని పక్కనే మురుగునీరు చేరుతోంది. మంచినీళ్లు, మురికి నీళ్లు కలిసిపోతున్నాయి.  మీరే చూడండి ఎలా ఉందో..
 (పంపు చూసిన ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్ వేణుమనోహర్‌కు ఫోన్ చేశారు. పార్శిబం ధం ప్రాంతంలో మురుగుకాల్వలు తీయాలని, పంపుల పరిసరాలు శుభం చేయాలని, ఉదయంకల్లా పనిపూర్తి చేయాలని ఆదేశించారు.)
 అజయ్‌కుమార్ : ఏం నాగేశ్వరరావు (మాజీ కౌన్సిలర్) బాగున్నారా?
 పాలకుర్తి నాగేశ్వరరావు : ఏం బాగు సారు.  మా వార్డుల్లో అర్హులైన వారి పెన్షన్లు తీసివేశారు. ఏ వీధికి వెళ్ళినా ముసలోళ్ల గోడు వినాల్సి వస్తోంది.
 రోడ్లు వేస్తమని ప్రతిసారీ అంచనాలు వేస్తున్నారు. కానీ పనులు చేపట్టడం లేదు. వీధి దీపాలు సక్రమంగా వెలగవు..కాల్వలు తీయ రు. అర్హులకు పింఛన్ అందేలా చూడండి.
 

మరిన్ని వార్తలు