రచయితలారా.. మీరెటువైపు?

10 Jul, 2015 18:06 IST|Sakshi
రచయితలారా.. మీరెటువైపు?

విప్లవ రచయితల సంఘం (విరసం) 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 12వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు విరసం నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. విప్లవ విద్యార్థి వివేక్ అమరత్వ స్ఫూర్తితో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. జూన్ 12న వరంగల్- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మడకం జోగి, మడకం దేవెలతో పాటు.. హైదరాబాద్లో న్యాయవిద్య చదువుతున్న వివేక్ కూడా మరణించిన విషయాన్ని విరసం నేతలు ప్రస్తావించారు. ఈ సమయంలో ''రచయితలారా.. మీరెటువైపు'' అనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.

కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో బంగారాన్ని, చంద్రబాబు చెప్పే నవ్యాంధ్రలో నవ్యతను చూడటం అజ్ఞానమేనని ఆ ప్రకటనలో విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంచులా మోగాల్సిన కంఠాలు కరువవ్వడం అన్నింటికంటే విషాదమని తెలిపారు.

ఇక 12వ తేదీనాటి సభలో వివిధ అంశాలపై వివిధ వక్తలు ప్రసంగిస్తారు. 'మేడిన్ ఇండియా - కాషాయీకరణ - జనతన సర్కార్ ప్రత్యామ్నాయం' అనే అంశంపై పాణి, 'ప్రజావ్యతిరేక భూసేకరణ ఆర్డినెన్సు'పై రవికుమార్, 'తెలంగాణలో పాలకుల ఎజెండా - ప్రజల ఎజెండా' అనే అంశంపై కాశీం, 'ఆంధ్రప్రదేశ్ పాలకుల ఎజెండా - ప్రజల ఎజెండా' అనే అంశంపై వరలక్ష్మి, 'మళ్లీ అదే ప్రశ్న .. రచయితలారా మీరెటువైపు' అనే అంశంపై వరవరరావు ప్రసంగిస్తారు. ఇదే సందర్భంలో వివిధ రచయితలు రాసిన 11 పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ప్రజా కళామండలి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు