జ్ఞాన సంపదను పురాణాలకు అంటగట్టవద్దు

10 Feb, 2019 02:43 IST|Sakshi

విరసం రాష్ట్ర కార్యదర్శి పాణి

నల్లగొండ కల్చరల్‌: భారతీయ జ్ఞాన సంపదను బ్రాహ్మణ్య కేంద్రంగా పురాణాలకు అంటగట్టే ప్రయత్నాన్ని సహించమని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి పాణి అన్నారు దీనిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన విరసం 21వ సాహిత్య పాఠశాల కార్యక్రమంలో ‘దేశీసాహిత్య సామాజిక చరిత్ర – మార్క్సిజం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశీయ సాహిత్యం, సామాజిక చరిత్రను మార్క్సిస్టు భావాలతో అర్థం చేసుకోవాలన్నారు. కాగా, మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ‘భీమా కోరేగావ్‌ – బ్రాహ్మణీయ వ్యతిరేక పోరాట ప్రతీక’అనే అంశంపై విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి ప్రసంగిస్తూ భీమా కోరేగావ్‌ చరిత్రను వివరించారు.

బ్రాహ్మణీయ కేంద్రంగా చరిత్రను రాసుకోవడం సంఘ్‌ పరివార్‌కు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. చరిత్రను ఆధిపత్య వర్గాలు తమకు అనుగుణంగా రాసుకున్నాయని, దాన్ని తిరస్కరిస్తూ అట్టడుగు వర్గాలు ఉద్యమాలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంగానే భీమా కోరేగావ్‌ పోరాటాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భీమా కోరేగావ్‌ పోరాటాన్ని బడుగు వర్గాలు స్ఫూర్తిగా తీసుకోవడం ఇవాల్టి పాలకవర్గాలకు కంటగింపుగా మారిందన్నారు.

దళితులు విజయోత్సవాలు చేసుకోవడం జీర్ణించుకోలేని సంఘ్‌ పరివార్‌ శక్తులు దాడులకు పాల్పడడంతో పాటు ఇద్దరు దళితుల హత్యకు కారణమయ్యాయని   పేర్కొ న్నారు. కలెక్టివ్‌ వాయిస్‌ కన్వీనర్, కవి యాకూబ్‌ మాట్లాడుతూ దేశంలో హిందూ ఫాసిజం పెచ్చరిల్లుతుందని, గౌరీ లంకేశ్‌ లాంటి ప్రజా మేధావులను హత్య చేసిన హిందూ మతోన్మాద శక్తులను ప్రశ్నిస్తే.. అర్బన్‌ మావోయిస్టుల పేరుతో జైళ్లలో నిర్బంధిస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు