4న విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ సభ

31 Oct, 2018 03:15 IST|Sakshi
ఆత్మగౌరవ సభ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జాజుల శ్రీనివాస్‌ గౌడ్, సంఘం ప్రతినిధులు

తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి వెల్లడి

హైదరాబాద్‌: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ సాధనకు వచ్చేనెల 4న నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో లక్షన్నర మందితో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సభ పోస్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే విశ్వబ్రాహ్మణుల సమస్యలు తీరుతాయనుకుని ఉద్యమంలో ముందుండి పోరాడామని, రాష్ట్రం వచ్చాక కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ విశ్వబ్రాహ్మణులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి పాలకమండలి నియమించాలని, యాభై ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు రూ. 5 వేల పింఛను ఇవ్వాలని, నిరుపేద విద్యార్థులకు విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీటితోపాటుగా ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ ‘బీ’నుంచి బీసీ ‘ఏ’కు మార్చాలని కోరారు. తమ డిమాండ్లు ఏ పార్టీ నెరవేరుస్తుందో వారికే తమ పూర్తి మద్దతిస్తామన్నారు. సభకు అన్ని పార్టీల నాయకులకు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డె సుదర్శనాచారి, ప్రధానకార్యదర్శి బచ్చల పద్మాచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిలుపూరి వీరాచారి, కోశాధికారి మోత్కూరి వీరభద్రాచారి, గోపాలచారి, శ్రీనివాస్, బాలాచారి, బ్రహ్మంతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు