లీకేజీల పరిశీలనకు వైజాగ్‌ డైవర్లు 

21 Apr, 2019 04:29 IST|Sakshi

కొనసాగుతున్న కాళేశ్వరం ట్రయల్‌రన్‌ ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్వహిస్తున్న ట్రయల్‌రన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ని నీటితో నింపి లీకేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌ను 124.5 మీటర్ల వరకు నీటితో నింపి లీకేజీలను గుర్తించేందుకు ప్రాజెక్టు అధికారులు వైజాగ్‌ షిప్‌ యార్డ్‌ నుంచి నైపుణ్యంగల డైవర్లను రంగంలోకి దింపారు. 8 మంది డైవర్ల బృందం నీటిలోకి దిగి సర్జ్‌పూల్‌నుంచి డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ల్లోకి నీరు ఎక్కడైనా చేరుతోందా అన్నది పరిశీలించారు. సర్జ్‌పూల్‌కు ఉన్న ఏడు గేట్ల పరిధిలో మూడు గేట్ల లీకేజీలను శనివారం తనిఖీ చేశారు. మిగతా నాలుగు గేట్ల పరిశీలన ఆదివారం కొనసాగనుంది.

ఇప్పటివరకు ఎలాంటి లీకేజీలు గుర్తించలేదని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ల నేతృత్వంలో పరిశీలన కొనసాగుతోంది. ఈనెల 24న మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించనున్నారు. ఈ మోటార్ల వెట్‌రన్‌ జరిగితే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఏడు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా నీరు బయటకు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో డెలివరీ సిస్టర్న్‌ నుంచి 3,200 క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉంది. మొత్తంగా 22,400 క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటి ప్రవాహం ఉండనుంది.

24న ‘కాళేశ్వరం’పై సీఎం ఏరియల్‌ సర్వే?
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్, గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ నిర్మాణాలపై సీఎం కేసీఆర్‌ నెల 24న ఏరియల్‌ సర్వే చేయనున్నట్టు సమాచారం. సీఎం ఆ రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మహదేవపూర్‌ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ, మహారాష్ట్ర భూభాగంలో పోచంపల్లి వైపు ఏరియల్‌ సర్వే చేయనున్నారు. అలాగే కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద నిర్మిస్తున్న అప్రోచ్‌ కెనాల్‌ పనులు, పంపుల ద్వారా నీటిని తరలించే గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ పనులను వీక్షించనున్నట్లు ఇరిగేషన్‌శాఖ అధికారుల ద్వారా తెలిసింది. అలాగే ఈనెల 26, 27 తేదీల్లో కన్నెపల్లిలోని మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం మరో సారి ఏరియల్‌ సర్వే చేస్తారని సమాచారం.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు