డంపింగ్‌ యార్డుల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రాలు

4 Oct, 2019 08:11 IST|Sakshi

పోలీసు శిక్షణే ఓ తంతులా మారింది 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల నష్టం 

పోలీసులను సమాజసేవకుడిలా తీర్చిదిద్దేందుకు కృషి 

ట్రైనింగ్‌లో సమూల మార్పులు తీసుకొస్తాం 

పోలీసు శిక్షణపై టీఎస్‌పీఏ డైరెక్టర్‌ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌:  పోలీసు శిక్షణ కేవలం తంతులా మారిందని, దేశం, రాష్ట్రాల్లోని వివిధ పోలీసు శిక్షణ కేంద్రాలు డంపింగ్‌ యార్డుల్లా మారాయని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్‌ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీస్‌ అకాడమీలో మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణ ఒక తంతులా మారింది. దేశంలోని పోలీసు ట్రైనింగ్‌ అకాడమీలు డంపింగ్‌ యార్డుల్లా మారాయి. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీఎన్‌పీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఐపీఎస్‌లలో కూడా అంకితభావం కొరవడటం బాధాకరం. ప్రస్తుత శిక్షణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చేలా పోలీసు శిక్షణను సంస్కరించాలి. దేశంలో బ్రిటిష్‌ కాలం నాటి పోలీసు విధానాల్లో మార్పులు రావాలి. డబ్బులు, పరపతి ఉన్న వారితో పోలీసులు స్నేహంగా మెదులుతున్నారు. విధి నిర్వహణలో నిత్యం వందలాది మంది ప్రాణాలర్పిస్తున్నా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకభావం కారణంగా పోలీసులపై సదభిప్రాయం కలగట్లేదు. ఈ విషయంలో మార్పురావాలి. అందుకే పోలీసు శిక్షణలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు అనుకూలంగా లేదు. జైలులో ఉంటున్న ఖైదీల్లో 90 శాతం పేదవారే, 70 శాతం శరణార్థులు ఉన్నారు. వారు ఎందుకు అరెస్టయి జైల్లో ఉన్నారో తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. 

శిక్షణలో ఒకలా.. విధుల్లో మరోలా.. 
‘శిక్షణలో పోలీసులు నేర్చుకున్న దానికి, విధుల్లో చేరాక చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదు. ప్రజల బాధలు తెలిసేలా.. శిక్షణ సమయంలోనే అనాథ, వృద్ధ, షెల్టర్‌హోమ్‌లు సందర్శించేలా చూస్తున్నాం. ఇంటెలిజెన్స్, ఏసీబీ ఇతర శాఖల అధికారులతో తరగతులు నిర్వహిస్తాం. అంకితభావంతో పనిచేసే పోలీసులను తయారు చేయడం మా సంకల్పం. అందుకే ప్రతి పోలీసు అ«ధికారికి శిక్షణ కాలం నుంచే అబ్జర్వేషన్‌ రిపోర్ట్‌ ప్రవేశపెట్టనున్నాం. భవిష్యత్తులో పోస్టింగులు, బదిలీల్లో ఇదే ప్రామాణికం కానుంది. దీనికి డీజీపీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. సమాజంలో పోలీసు కావాలంటే దేహదారుఢ్యమే ముఖ్యం కాదు.. శారీరక లోపాలున్నా నిజాయతీగా పనిచేయొచ్చు.

ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలంగాణ అవినీతిలో ముందు ఉండటం బాధాకరం. పోలీసులు సమర్థంగా పనిచేస్తే ఇలాంటివి జరగవు. నేషనల్‌ పోలీస్‌ అకాడమీనే కాదు.. దేశంలో ఎవరూ చేయలేని నూతన సంస్కరణలను టీఎస్‌పీఏలో తీసుకొస్తాం. చట్టాలు, ఆయుధ, శారీరక, ఆత్మరక్షణ శిక్షణే కాదు.. ప్రజలకు సేవలు చేసేందుకు దోహదపడేలా ప్రయోగశాలగా మారుస్తాం. వ్యవస్థను మార్చలేను.. కానీ శిక్షణ విధానాన్ని మార్చగలను. ఈ నెల 24 నుంచి ఎస్సైలకు శిక్షణ ప్రారంభమవుతుంది’అని వీకే సింగ్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు