గిఫ్టు పట్టు.. ఓటు కొట్టు..

5 Nov, 2018 09:25 IST|Sakshi

గంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థుల పాట్లు

వెరైటీ బహుమతులు అందజేస్తున్న నేతలు

ఈసీ కళ్లుగప్పి ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్‌: ఓటు కొట్టు..గిఫ్టు పట్టు అన్న చందంగా మారింది గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తీరు. ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతున్న తరుణంలో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు మహిళలు, యువతీయువకుల ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు సవాలక్ష ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఇదే క్రమంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా తాయిలాలిచ్చేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. కేడర్‌ను వెంట తిప్పుకునేందుకు బీరు.. బిర్యానీ పథకం సంగతెలా ఉన్నా..బస్తీలు, కాలనీల్లో మెజార్టీ ఓట్లను ఆకర్షించేందుకు వెరైటీ గిఫ్ట్‌ ఐడియాలను కనిపెడుతుండడం విశేషం. ప్రధానంగా ఇటీవలే ఓటుహక్కు సాధించిన యువకుల మనసు దోచుకునేందుకు క్రికెట్‌ కిట్లు, వాలీబాల్, బాస్కెట్‌ బాల్‌లు, నెట్స్, షటిల్‌బ్యాట్లు, టీషర్ట్స్, కమ్యూనిటీ హాళ్లలో ఆడుకునేందుకు వీలుగా చెస్, క్యారమ్స్, స్నూకర్‌ టేబుల్స్‌ అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ తాయిలాల ఆశ చూపి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గృహిణులకైతే చీరలు..సారెలే కాదు..వెండి ప్లేట్లు, కుంకుమ భరిణెలు, టిఫిన్‌బాక్సులు, మిక్సీలు, గ్యాస్‌స్టవ్‌లు, బ్యాగులతోపాటు అధికంగా ఓట్ల వర్షం కురుస్తుందనుకున్న వారికి ఏకంగా కుట్టు మిషన్లు, కలర్‌టీవీలు,ఫ్రిజ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా వస్తుసామగ్రి కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల అధికారుల డేగ కళ్ల నిఘా నేపథ్యంలో తమ అనుచరగణంతో ఈ గిఫ్ట్‌లను భారీగా కొనుగోలు చేయించి ఎక్కడికక్కడే కాలనీలు, బస్తీల్లో నిల్వచేస్తున్నారు. పనిలో పనిగా ఇంటింటి ప్రచారం చేపడుతూ కరపత్రాలు పంచుతూనే ఈ తాయిలాల ఆశ చూపుతుండడం ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది.  

ఈసీ కళ్లు కప్పి..
ఎన్నికల ఖర్చులోప్రతీపైసాకు లెక్కచూపాల్సిన అవసరం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ చేతికి మట్టి అంటకుండా..ఎన్నికల కమిషన్‌ దృష్టిలో పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో నగదు కొరత నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తమ పార్టీకి అండగా నిలిచే ముఖ్యనేతలు, కార్పొరేటర్లు, మాజీలు, ఫైనాన్సియర్లు, బిల్డర్లను ఎన్నికల ఖర్చు, గిఫ్ట్‌ల కొనుగోలుకు చేసే వ్యయాన్ని భరించాల్సిందిగా కోరుతున్నారు. ఈ పనుల్లోనూ అభ్యర్థులు చిక్కుల్లో పడకుండా తమ సన్నిహితులు, ముఖ్య అనుచరులకే మొత్తం చక్రం తిప్పాలని ఆర్డర్లు వేసేస్తున్నారు. నగర శివార్లలో ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరత్తిస్తుండగా..విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల నుంచి టిక్కెట్లు ఖాయం అనుకుంటున్న వారు సైతం ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ..ఈపార్టీ అన్న తేడా లేకుండా ఒకరు రెండు గిఫ్ట్‌లు ఇస్తే మరొకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్క గిఫ్ట్‌ అయినా ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న ట్రెండ్‌ సర్వత్రా కనిపిస్తుంది. 

మరిన్ని వార్తలు