ఓటుకు కోట్లు కేసు; ‘నా కుమారులను ఇరికించడం సరికాదు’

12 Feb, 2019 19:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటుకు కోట్లు కేసులో ఈడీ ఎదుట వేం నరేందర్‌ రెడ్డి విచారణ ముగిసింది. నరేందర్‌ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను విచారించిన ఈడీ... నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు, మిగతా నాలుగున్నర కోట్ల గురించి కూడా ఆరా తీసింది. ఈ సందర్భంగా వారు పొంతన సమాధానాలు చెప్పడంతో సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజ్‌ శేఖర్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. కాగా ఏసీబీ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఈ కేసులో నిందితులందరినీ విచారించే అవకాశం ఉంది. ఈమేరకు రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన ఈడీ వారం రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించింది.

నా కొడుకులను ఇరికించడం సరికాదు
ఓటుకు కోట్లు కేసులో తనతో పాటు తన ఇద్దరు కుమారులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని నరేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి, ఉదయ్‌ సింహకు కూడా నోటీసులు ఇచ్చారు. నాతో పాటు నా కొడుకులను విచారించడం చాలా బాధేసింది. వారిని ఇరికించడం సరికాదు. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల విచారణను ఉద్దేశపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిజాలన్నీ కోర్టు విచారణలో తేలతాయి. ఎప్పుడు విచారణకి పిలిచినా హాజరవుతా’ అని పేర్కొన్నారు.

కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్‌ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్‌ రెడ్డి, ఉదయ సింహను విచారించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు