ఓటర్లు ఎవరిని కరుణిస్తారో..

10 Apr, 2019 12:14 IST|Sakshi

ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెర

సాక్షి, వికారాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఓటర్లు తీర్పు చెప్పడమే మిగిలి ఉంది ఉంది. పదిహేను రోజులుగా ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల చేతిలోపెట్టి మైకులు బంద్‌ చేశారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించాయి.

ఆయా పార్టీల అగ్రనేతలు తరలివచ్చి రాజకీయాన్ని వేడెక్కించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదిరతులు వచ్చి తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు.

15 రోజులుగా మోతమోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. చివరిరోజున అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలంటూ కోరుతూ మహేందర్‌రెడ్డి పట్టణంలో ప్రచారం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా తాండూరులో ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. వికారాబాద్‌ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రచారం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిగిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు చివరిరోజు గ్రామాల్లో ప్రచారం చేశారు.    

వ్యూహాలకు పదును...  
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లపైనే భారం వేశారు. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ ప్రధాన పార్టీల్లో నెలకొంది. పోలింగ్‌కు కొద్ది గంటల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలుపు వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.

వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఎంపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి తెరవెనుక జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు తమకు దక్కేలా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.  

ప్రలోభాలు షురూ.. 
ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో ఆయా పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. గెలుపు కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.వికారాబాద్‌లోని రాజీవ్‌నగర్‌లో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో రూ.కోటియాభై లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ డబ్బు పోస్టల్‌శాఖకు చెందినగా తెలిసింది. వికారాబాద్‌ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పోలీసులు తమ డబ్బును పట్టుకున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు