ఓటర్ల లెక్క తేలింది..!

12 Jul, 2019 08:25 IST|Sakshi
హాలియా వ్యూ

హాలియాలో మున్సిపాలిటీలో ఓటర్లు 12,770,  నందికొండలో 12,800 

ఓటర్ల జాబితా ముసాయిదా  ప్రదర్శన 

సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధమయ్యింది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కో సెట్‌ జాబితాను అందించారు. ఈనెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించనున్నారు. ఈనెల 14న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కుదించిన షెడ్యూల్‌తో మరో నాలుగు రోజుల ముందే ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టారు. ఈనెలలోనే ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుతో పాటు పోలింగ్‌ పర్యవేక్షణకు అధికారుల నియామకం కూడా చేపట్టారు.

హాలియా మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లు అధికం..
హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డుల్లో సిబ్బంది ఓటర్ల గణనను పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,388 మంది కాగా స్త్రీలు 6,382 మంది ఉన్నారు. దీనిలో బీసీ ఓటర్లు మొత్తం 8,242 మంది ఉండగా పురుషులు 4,118 మంది, స్త్రీలు 4,124 మంది ఉన్నారు. అదే విధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 1,703 మంది ఉండగా వీరిలో పురుషులు 850 మంది కాగా స్త్రీలు 853 మంది ఉన్నారు.

ఎస్టీ ఓటర్లు మొత్తం 479 మంది కాగా వీరిలో పురుషులు 220 మంది, స్త్రీలు 259 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 2,346 మంది ఉండగా పురుషులు 1,200 మంది, స్త్రీలు 1,146 మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మున్సిపాలిటీ పరి«ధిలోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను త్వరలో స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. 

మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలు..
హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన కాలనీలు ఇలా ఉన్నాయి. అనుముల, అనుములవారిగూడెం, ఈశ్వర్‌నగర్, సాయిప్రతాప్‌నగర్, గంగారెడ్డినగర్, వీబీనగర్, గణేష్‌నగర్, ఎస్సీ కాలనీ, సాయినగర్‌ కాలనీ, శాంతినగర్, వీరయ్యనగర్, అంగడి బజార్, రెడ్డికాలనీ, బీసీకాలనీ, హనుమాన్‌నగర్, కేవీ కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఇబ్రహీంపేట, అలీనగర్‌ కాలనీలను కలుపుతూ 12 వార్డులుగా విభజించారు.

నందికొండ మున్సిపాలిటీలో తేలిన లెక్క  
నాగార్జునసాగర్‌ : నందికొండ మున్సిపాలిటీలో గల హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీల్లోని 12వార్డుల్లో సామాజిక వర్గాల వారిగా గల ఓటర్ల లెక్కను తేల్చారు. ఓటర్ల సంఖ్య 12,800మంది ఉండగా బీసీ ఓటర్లు 6,839మంది ఉన్నారు. పురుష ఓటర్లు 6,204మంది ఉండగా మహిళా ఓటర్లు 6,596 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,941 మంది ఉండగా ఎస్టీ ఓటర్లు 716 మంది ఉన్నారు. ఓసీ ఓటర్ల సంఖ్య 2,304 మంది ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా