ఆద్యంతం ధన ప్రవాహమే 

16 Dec, 2018 04:17 IST|Sakshi

ఎన్నికల్లో అడుగడుగునాడబ్బు, మద్యం పంపిణీ 

రాజకీయ పార్టీలఖర్చయితే లెక్కేలేదు

 తెలంగాణ ఎన్నికలనిఘా వేదిక వెల్లడి

 సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగిందని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని తెలిపింది. అధికారుల తనిఖీల్లోనూ రికార్డు స్థాయిలో నగదు దొరికిందని, ఇంత పెద్దమొత్తంలో ధన ప్రవాహం ఇప్పటివరకూ జరగలేదని వ్యాఖ్యానించింది. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం సైతం పూర్తిగా విఫలమైందని నిఘా వేదిక అభిప్రాయపడింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం.పద్మనాభ రెడ్డి, డాక్టర్‌ రావు చెలికాని, బండారు రామ్మోహన్‌రావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్‌ పాల్గొని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన అంశాలను జిల్లాల వారీగా నివేదించారు.  

ఓటరు జాబితాలో భారీగా అక్రమాలు 
ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, కొత్తగా ఓటర్లు నమోదై స్లిప్పులు పొందినప్పటికీ చివరి నిమిషంలో వారి ఓట్లు గల్లంతయ్యాయని నిఘా వేదిక సభ్యులు తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే సీఈఓ రజత్‌కుమార్‌ క్షమాపణ చెప్పి చేతులెత్తేశారన్నారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు నమోదు కాగా...పాత ఓటర్లు భారీగా తొలగించబడ్డారని, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు కనిపించిందన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఓటరు జాబితాలో అవకతవకలపై కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఓటరు జాబితాను ఆన్‌లైన్‌లో ఆల్ఫాబెటిక్‌ ఆర్డర్‌లో పెడితే డ్యూయల్‌ ఓట్లు తగ్గిపోతాయని, ఓటరు కార్డును ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఖర్చుపై సీలింగ్‌ విధించాలని, నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, పార్లమెంటు, సహకార, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్కాగా పనిచేయాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, ఓటర్లలో అవగాహన పెంచడంతో పాటు ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నివేదిక ప్రతులను త్వరలో జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు