‘సహకార’ ఓటరు జాబితాకు రెడీ

31 Jan, 2018 17:01 IST|Sakshi
గంభీర్‌పూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

కొత్తగా ఫొటోలతో కూడిన జాబితా

అధికారులకు ఉత్తర్వులు జారీ

గడువు ఫిబ్రవరి 15

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఓటరు జాబితాలు తయారుచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని ఈసారి ఓటుహక్కు ఉన్న రైతు ఫొటోలతో కూడిన జాబితాలు తయారుచేయాలని నిర్ణయించారు. జాబితా తయారీకి ఫిబ్రవరి 15వ తేదీని గడువు విధించారు.  
కథలాపూర్‌(వేములవాడ) : జిల్లాలోని 18 మండలాల్లో  51 సహకార సంఘాలున్నాయి. ఇందులో 95,386 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఓటరు జాబితా తయారీ సహకార సంఘాలవారీగా చేపట్టాల్సి ఉండడంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఓటరుజాబితాల ఫైళ్లను వెతికి సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటికితోడు కొత్తగా ఓటు హక్కు కావాలనుకునే రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ పరిధిలోని  గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.


ముగుస్తున్న గడువు...
సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 31తో ముగియనుంది. పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తారా.. లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా, ఎన్నికలు నిర్వహిస్తారా? అనే విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సిఉంది. గడువు ముగియనుండడంతో సహకార ఎన్నికల బరిలో ఉండాలనుకునే వారు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తయారుచేయాలని ఆదేశాలు రావడం.. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల వేడి రాజుకుంటోంది. సహకార సంఘాల అధ్యక్ష, డైరెక్టర్‌ పదవులు ఆశిస్తున్న నాయకులు తమ అనుచురుల పేర్లు ఓటరు జాబితాలో చేర్పించే ప్రయత్నంలో మునిగిపోయారు. గ్రామాల్లో ముఖ్యనేతలు కూడళ్ల వద్ద తమ అనుచరగణంతో మంతనాల్లో  మునిగి తేలుతున్నారు.  


కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే...  
సహకార సంఘాల్లో ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు పట్టదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డ్‌ జిరాక్స్‌తోపాటు రూ.350 చెల్లించి రెండు ఫొటోలు తమ పరిధిలోని కార్యాలయాల్లో అందించాలి. గతంలో ఓటరు జాబితాలో పేర్లున్న రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌తోపాటు రెండు ఫొటోలు ఇవ్వాలి.


ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు సమర్పించాలి
సహకార సంఘాల ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని, తప్పులు లేకుండా తయారు చేయాలని అధికారులకు సూచించాం. ఓటరు జాబితాను రైతు ఫొటోలతో అనుసంధానం చేసేందుకు ఫిబ్రవరి 15 వరకు చివరి గడువు విధించాం. ఓటరు జాబితాలో పేర్లున్న రైతులు ఫొటోలను సహకార సంఘం కార్యాలయాల్లో గడువులోగా అందించాలి. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకునే రైతులు పరిధిలోని సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించాలి.  –రామానుజచార్యులు, జిల్లా సహకార అధికారి
 

మరిన్ని వార్తలు